కేసీఆర్‌ ప్రగతిభవన్‌ ఖాళీ చేయడం ఖాయం

20 Nov, 2018 13:46 IST|Sakshi
రోడ్‌ షోలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి  

సాక్షి, చండూరు (మునుగోడు) : కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. దీంతో ప్రగతిభవన్‌ ఖాళీ చేసి ఫాంహౌస్‌కు వెళ్లడం ఖాయమని మహాకూటమి బలపర్చిన మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చండూరులోని ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసి అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ 60ఏళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేస్తుంటే ప్రజల ఆకాంక్ష గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానని చెప్పిన కేసీఆర్‌ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తిచేయించి లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, వేనేపల్లి వెంకటేశ్వరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మునగాల వెంకటేశ్వరావు, టీపీసీసీ కార్యదర్శి లు కర్నాటి వెంకటేషం, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధులు పున్న కైలాస్‌ నేత, నారబోయిన రవి,  సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీలు తోలక వెంకన్న, అనంత రాజుగౌడ్, చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వాకుడోతు బుజ్జి, జెడ్పీటీసీలు అన్నెపర్తి సంతోష, శేఖ ర్, జాజుల అంజయ్యగౌడ్, మేతరి యాదయ్య, నాయకులు సుజాహుద్దిన్, కలిమికొండ జనార్ధన్, కొడి గిరిబాబు, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, దొటి వెంకటేష్, ఇరిగి రాజు, మొగుదాల దశరథ, లింగయ్య, రాంమూర్తి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు