తొలి రోజు 25 దరఖాస్తులు

11 Feb, 2019 04:14 IST|Sakshi

లోక్‌సభ పోటీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన కాంగ్రెస్‌

ఖమ్మం నుంచి పోటీకి సీనియర్‌ నేత వీహెచ్‌ దరఖాస్తు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్‌ ప్రారంభించింది. ఆదివారం నుంచి ఈ స్వీకరణ ప్రారంభం కాగా, తొలిరోజు పలు లోక్‌సభ నియోజకవర్గాలకు 25 దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు దరఖాస్తు చేసిన వారిలో పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, కోదండరెడ్డి తదితరులున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం వరకు కొనసాగనుంది.

సోమ, మంగళవారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం గాంధీభవన్‌లో పలు సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మీడియా కో ఆర్డినేషన్‌ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ భేటీలు జరగనున్నాయి. ఈ భేటీల అనంతరం మంగళవారం ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్‌సభకు పోటీచేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్టు చేయనున్నారు. 

పోటీకి సై అంటున్న సీనియర్లు
ఈ సారి కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని మాజీ ఎంపీ వీహెచ్, భువనగిరి సీటు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డిలు ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. తమ దరఖాస్తులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మల్లు రవి (నాగర్‌కర్నూల్‌), కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ (మహబూబాబాద్‌)లు కూడా తమ దరఖాస్తులు అందజేశారు. కాగా, భువనగిరి స్థానం నుంచి టికెట్‌ కోసం నల్లగొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నల్లగొండ పార్లమెంటు కోసం సూర్యాపేటకు చెందిన పటేల్‌ రమేశ్‌రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. ఇక, రిజర్వుడు నియోజకవర్గాలైన వరంగల్‌ నుంచి ఇందిరా, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూల్‌ నుంచి సతీశ్‌మాదిగలు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు