స్వయంగా పరీక్ష రాసిన వీణావాణీలు

20 Mar, 2020 03:47 IST|Sakshi
మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో పరీక్ష రాసేందుకు మాస్క్‌లు ధరించి వస్తున్న అవిభక్త కవలలు వీణా, వాణి

స్క్రైబర్లను వద్దని తామే పరీక్ష రాసిన చిన్నారులు

వారి పరీక్షల కోసం ప్రత్యేక గది, ఇతర సౌకర్యాలు

వెంగళరావునగర్‌: విధి పరీక్షను చిర్నవ్వుతో ఎదుర్కొంటూనే పాఠాలు నేర్చుకున్న అవిభక్త కవలలైన వీణావాణీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలకు హాజరై తమ ఆత్మస్థైర్యాన్ని చాటి తమలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చారు. స్టేట్‌హోంలోని బాలసదన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న ప్రతిభా హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా వీరిని తీసుకొచ్చారు. బాలసదన్‌ ఇన్‌చార్జి సఫియా బేగంతో పాటు మరో సహాయకురాలు వీరితో పాటు వెంటవచ్చారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. దీంతో వీణావాణీలు స్వయంగానే తెలుగు పరీక్షను రాశారు.

నంబర్లు కన్పించక కొద్దిసేపు అయోమయం 
కాగా, పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన గదులు, విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లతో అంటించిన నోటీసు బోర్డులో వీణావాణీల హాల్‌ టికెట్‌ నంబర్లు లేకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిభా హైస్కూల్‌లో 11 గదులను (2022188183 నుంచి 2022188402 వరకు) ఏర్పాటు చేశారు. అయితే వీణావాణీల నంబర్‌ మాత్రం 2022188403/404గా ఉన్నాయి. వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో నోటీసుబోర్డులో అంటించలేదని స్కూల్‌ నిర్వాహకులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు