‘పది వేలు ఇస్తేనే సంతకం పెడతా’

26 Sep, 2018 10:23 IST|Sakshi
తహసీల్‌ కార్యాలయం ఎదుట బాధితుడి కుటుంబ సభ్యుల ఆందోళన విష్ణు చేతులు, మెడకు గాయాలు

బిచ్కుంద(జుక్కల్‌): ప్రజాసేవకు నిలయమైన ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలోని తహసీల్‌లో మంగళవారం ఓ కాంట్రాక్టర్‌ బ్లేడ్‌తో చేతులు, మెడ కోసికుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. డీటీ ప్రవీణ్‌ కుమార్‌ హజ్గుల్‌ జీపీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. గ్రామంలో విష్ణు మానిక్‌ నాయక్‌ సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.45 వేలు బిల్లు వచ్చింది. చెక్కుపై సంతకం కోసం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌ కుమార్‌ రూ.10 వేలు లంచం ఇవ్వాలని వారం రోజుల నుంచి వేధింస్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్‌ విష్ణు మనస్తాపం చెంది మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో బ్లేడ్‌తో చేతులు, మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
ఎంబీ రికార్డులో వందశాతం పనులు 
హజ్గుల్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద రూ.2 లక్షల 40 వేలు సీసీ రోడ్డు వేశారు. వంద శాతం పనులు పూర్తయ్యాయి. పంచాయతి రాజ్‌ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేసి రూ. 45 వేలను పీఆర్‌ శాఖ జీపీ ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌(ఎఫ్‌టీవో)ను జీపీ కార్యదర్శి చూసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని క్యాష్‌ బుక్‌లో ఎంట్రీ చేసి రూ.45 వేల చెక్కును కాంట్రాక్టర్‌ విష్ణుకు రాసి ఇచ్చారు. చెక్కుపై ప్రత్యేకాధికారి, డీటీ ప్రవీణ్‌ కుమార్‌ సంతకం ఉండాలి. వారం నుంచి సంతకం కోసం తహసీల్‌ చుట్టూ విష్ణు తిరుగుతున్నాడు. రూ.10 వేలు లంచం ఇస్తేనే సంతకం పెడతానని డీటీ వేధిస్తున్నాడని బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వలేను. ఇది చివరి బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా భార్య బంగారు పుస్తే, నగలు అమ్ముకొని సీసీ వేశానని మొరపెట్టుకొని రెండు కాళ్లు పట్టుకున్నా వినడం లేదన్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఘటనతో తహసీల్దార్, ఎంపీడీవో డీటీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే బాధితుడి చెక్కుపై సంతకం చేశారు.

కార్యాలయం ఎదుట గిజనుల ఆందోళన 
బిచ్కుందకు చెందిన కాంట్రాక్టర్‌ విష్ణు మానిక్‌ నాయక్‌ను లంచం ఇవ్వాలని డీటీ వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు తెలియడంతో భద్రాల్‌ తండా గిరిజనులు తహసీల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తం కారుతున్న విష్ణును ఆస్పత్రికి తరలించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీటీని నిలదీశారు. వెంటనే సస్పెండ్‌ చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. గాంధారిలో కూడా అక్రమాలకు పాల్పడి బదిలీపై బిచ్కుంద వచ్చి అవినీతికి పాల్పడుతున్నారని డీటీపై కలెక్టర్‌ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఈ ఘటనపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్‌ గోవర్ధన్, ఎంపీడీవో సాయిబాబా అన్నారు.

మరిన్ని వార్తలు