24 గంటలే కీలకం!

31 Jan, 2020 09:43 IST|Sakshi

ఈ– కామర్స్‌ మోసాలతోబాధితుల బెంబేలు

కొత్త పంథాను అనురిస్తున్నసైబర్‌ నేరగాళ్లు

బ్యాంక్‌ ఖాతాల్లోని డబ్బులు మటుమాయం

సకాలంలో ఫిర్యాదు చేస్తే రికవరీకి అవకాశం

ఎంత వేగిరంగా స్పందిస్తే అంత ప్రయోజనం

సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సమాజం ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తోంది. ఇదే క్రమంలో నేరాలు సైతం కొత్త పంథాను పేట్రేగిపోతున్నాయి.  ఆన్‌లైన్‌ లావాదేవీల వ్యవహరం ఊపందుకోవడంతో సైబర్‌ నేరాల తీవ్రత పెరుగుతోంది. ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో జరిగిన నేరాలు.. ఇప్పుడూ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. మొన్నటిదాకా  క్లోనింగ్‌కు చేసిన నేరగాళ్లు ప్రస్తుతం ఈ– కామర్స్‌ మోసాల వైపు దృష్టి సారించారు. తమ వ్యాపార లాభాల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిస్తే చాలు ఆర్డర్‌ కోసమంటూ నమ్మించి ఏకంగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్‌ ఖాతాల నుంచే డబ్బులు తస్కరిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఆన్‌లైన్‌లో జరిగే ఏ నేరమైనా ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన మోసం కేసుల్లో సత్వర ఫిర్యాదుతోనే డబ్బు రికవరీకి అవకాశముంటుంది. బాధితులకు కూడా న్యాయం జరుగుతుంది.  

సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు ఇలా..
మోసానికి గురైన బాధితుడు 24 గంటల్లో స్పందించడం కీలకం. తొలుత బ్యాంక్‌ అధికారులను సంప్రదించి లావాదేవీల వివరాల ప్రతిని తీసుకొని సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన మోసాన్ని వివరిస్తూ పోలీసులు వెంటనే ఈ– కామర్స్‌ వెబ్‌సైట్ల ప్రతినిధులకు మెయిల్‌ పంపిస్తారు. అవసరమైతే ఫోన్‌లోనూ సంప్రదించి తక్షణమే ఆ లావాదేవీని ఆపేందుకు కృషి చేస్తారు. తద్వారా సైబర్‌ నేరగాళ్ల పాలైన సొమ్మును బాధితుడి ఖాతాకు తిరిగి పంపిస్తారు. ఈ రకంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సత్వర ఫిర్యాదుతో పూర్తి స్థాయిలో డబ్బులు రికవరీ అయిన ఘటనలు ఉన్నాయి. ఈ నేరాలు ఎక్కువగా ముంబై, ఢిల్లీ, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ కేంద్రాలుగా సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సకాలంలో ఫిర్యాదు చేసిన వారిలో 80 శాతం మందికిపైగా సొమ్మును తిరిగి తెప్పించగలిగారు. సత్వర స్పందనను బట్టి ఒక్కో ఘటనలో 20 నుంచి 95 శాతం వరకు డబ్బు రికవరీ అవుతుండడంతో బాధితులకు ఉపశమనం చేకూరుతోంది. 

నాడు క్లోనింగ్‌.. నేడు ఈ– కామర్స్‌
సైబర్‌ నేరాలకు పెట్టింది పేరైనా నైజీరియన్లు తొలినాళ్లలో డెబిట్‌కార్డుల క్లోనింగ్‌కు పాల్పడేవారు. ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేసి డబ్బు డ్రా చేసేందుకు సహాయం చేస్తామని అమాయకులను నమ్మించి ఏటీఎం, పిన్‌ నంబర్లను తెలుసుకునేవారు. సెక్యూరిటీ సిబ్బంది లేని ఏటీఎం యంత్రాల్లో రహస్యంగా ఓ పరికరాన్ని అమర్చి ఎవరైనా డబ్బు డ్రా చేస్తే వివరాలు ఆ పరికరంలో నమోదయ్యేలా చేసేవారు. తర్వాత వివరాల ఆధారంగా క్లోనింగ్‌ ప్రక్రియలో కొత్త కార్డు తయారుచేసి వేర్వేరు చోట్ల ఏటీఎంల ద్వారా బాధితుల ఖాతా నుంచి డబ్బు కాజేసేవారు. అప్పట్లో ఇదే తరహా మోసాలు కొనసాగించిన నైజీరియన్‌లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సరికొత్త రీతిలో డబ్బులు స్వాహా చేస్తున్నారు. బ్యాంక్‌ ఖాతా వివరాలను భద్రపరిచే సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి వాటిని సంపాదిస్తున్నారు. బ్యాంక్‌ నుంచే ఫోన్‌ చేసినట్లు నమ్మిస్తూ ఏటీఎం, పిన్, సీవీవీ నంబర్లను తెలుసుకుంటున్నారు. ఏటీఎం బ్లాక్‌ అయింది. తిరిగి రెన్యూవల్‌ చేయాలనో, అప్‌డేట్‌ చేయాలనో చెప్పి వివరాలు లాగించేస్తున్నారు. తర్వాత బాధితుల ఖాతా నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు.  

ఓటీపీకి సైతం గాలం..
డెబిట్‌ కార్డు చేతిలో లేకపోతే పిన్‌ నంబర్‌ తెలిసినా ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయడం సాధ్యం కానందున నేరగాళ్లు ఈ కామర్స్‌ వెబ్‌సైట్లను ఇందుకు అనువుగా ఉపయోగించుకుంటున్నారు. బాధితులకే నేరుగా ఫోన్‌కాల్‌ చేసి కార్డును అప్‌డేట్‌ చేసే ప్రక్రియలో భాగంగా ఇదివరకే మీరు రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌కు కోడ్‌ (వాస్తవానికి అదే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌)ను పంపిస్తున్నామంటూ నమ్మిస్తారు. పేరు, ఫోన్‌నంబర్, చిరునామా.. ఇలా వివరాలను కచ్చితంగా చెబుతుండడంతో చాలా సందర్భాల్లో నేరగాళ్లను బ్యాంక్‌ ప్రతినిధులుగా బాధితులు భ్రమపడుతున్నారు. వాస్తవానికి ఖాతాదారుల వివరాలను సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేస్తున్న నేరగాళ్లు, తమను తాము బ్యాంక్‌ ప్రతినిధులుగానే భ్రమింపజేస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎలాంటి భయం లేకుండా నేరగాళ్లకు చెప్పేస్తున్నారు. దీంతో నేరగాళ్లు సులభంగా ఖాతాల నుంచి డబ్బులను తీసుకోగలుగుతున్నారు. ఇలా వీలైనన్నిసార్లు బాధితులకు ఫోన్‌కాల్‌ చేస్తున్న నేరగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఓ బ్యూటీపార్లర్‌ నడుపుతున్న యువతి రూ.94,572 నష్టపోవడం గమనార్హం.  

నయా మోసాలు ఇలా..
ఓ బ్యూటీపార్లర్‌ నడుపుతున్న యువతి జస్ట్‌ డయల్‌లో తన సంస్థను రిజిస్టర్‌ చేసుకుంది. జస్ట్‌ డయల్‌ ద్వారా సదరు బ్యూటీపార్లర్‌ను సంప్రదించిన ఓ మోసగాడు సినీ పరిశ్రమకు చెందినవాడినని పరిచయం చేసుకొని 30 మంది మహిళలకు వధువులాగా మేకప్‌ చేస్తే రూ.5 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పారు. ఈ మాటలు నమ్మిన యజమానురాలు మేకప్‌ చేసేందుకు మీ ఇంటికి వస్తానని చెప్పింది. ఆ వెంటనే మీకు డబ్బులు పంపిస్తానంటూ బ్యాంక్‌ ఖాతా వివరాలు తీసుకున్నాడు. మీ బ్యాంక్‌ ఖాతాలో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేసినా సాంకేతిక కారణాలతో కనిపించలేదని, అవి రిటర్న్‌ చేస్తే మళ్లీ పంపిస్తానంటూ చెప్పాడు. ఇది నమ్మి ఆమె రూ.2 లక్షలు పంపించి మోసపోయింది.  
ఓ నిరుద్యోగి వివిధ జాబ్‌ పోర్టల్స్‌లో రెజ్యూమ్‌ నిక్షిప్తం చేశాడు. గత నెల 7న రోహన్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. రూ.10లక్షల రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించామన్నాడు. ఆ వెంటనే మాన్‌స్టర్‌ జాబ్స్‌.కో అనే లింక్‌ను బాధితుడి సెల్‌ఫోన్‌కు పంపాడు. ఇందులో లాగిన్‌ అయిన బాధితుడు కూకట్‌పల్లి వాసి నందమ్‌ మహా విష్ణు వర్ధన్‌ నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఫీజు చెల్లించబోయాడు. బ్యాంక్‌ ఖాతా వివరాలతో పాటు తన సెల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే ‘ఎర్రర్‌ అకర్డ్‌.. ప్లీజ్‌ ట్రై లేటర్‌’ అని వచ్చింది. ఆ తర్వాత రూ.94,572 అతని ఖాతా నుంచి బదిలీ అయ్యాయని సంక్షిప్త సమాచారం వచ్చింది.  

ఆ కాల్స్‌కు స్పందించొద్దు..   
బ్యాంక్‌ ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ చేసి వివరాలు అడగరు. ఒకవేళ అటువంటి కాల్స్‌ వస్తే పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ ఆ వివరాలు చెప్పాల్సి వస్తే నేరుగా బ్యాంక్‌కే వెళ్లి చెప్పడం మంచిది. ఫోన్‌లో చెప్పడం శ్రేయస్కరం కాదు. బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్టు తెలిస్తే సాధ్యమైనంత తొందరగా ఫిర్యాదు చేయాలి. కొంతమంది మీ ఉత్పత్తులు కొంటామంటూ ఆన్‌లైన్‌లో వివిధ సంస్థల    వివరాలు అడిగి ఆన్‌లైన్‌ లావాదేవీల  యాప్‌ల లింక్‌ పంపి మరీ డబ్బు కొల్లగొడుతున్నారు. ఫోన్‌ల ద్వారా వచ్చే ఏ కాల్‌కైనా స్పందించవద్దు.  – రోహిణి ప్రియదర్శిని,సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ

>
మరిన్ని వార్తలు