ముంపు భయం..! 

17 Sep, 2018 07:49 IST|Sakshi
బూర్గంపాడు మండలంలో గోదావరి వరదలకు నీటమునిగిన జామాయిల్‌ పంట( ఫైల్‌)

సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): గత నెలలో వరదలు వచ్చినప్పుడు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక దాటితే ఇక భారీ నష్టమే. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మిస్తే భవిష్యత్తులో ముంపు భయం మరింతగా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, ముంపు వాసులను అప్రమత్తం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద ఈ నీటిమట్టం నిరంతరం కొనసాగుతుంది. ఇక ప్రతి ఏటా వచ్చే వర్షాలకు  ప్రవాహం పెరిగితే అత్యంత వేగంగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో 53 అడుగుల మేర నీటిమట్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే పంటలు, 53 అడుగులకు చేరగానే పరీవాహక ప్రాంతాల్లోని రోడ్లు మునిగిపోతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చితే నష్టం అపారంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు ఇప్పటినుంచే ‘పోలవరం’ భయం పట్టుకుంది. ఆనకట్ట నిర్మిస్తే ప్రతి ఏటా నష్టం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
భవితవ్యంపై ఆందోళన.. 
ఎగువ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలతో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మొత్తం 1,258 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. ఇక గోదావరి ఎగపోటు కారణంగా చర్ల మండలంలోని తాలిపేరు, బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని నదులు సైతం పొంగిపొర్లుతాయి. దీంతో రైతులకు నష్టం మరింతగా పెరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయితే గోదావరి ఉధృతి పెరిగి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, మంగపేట మండలాలకు సైతం ముంపు బెడద వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పుడు తమ భవితవ్యమేంటని ఆయా మండలాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న గోదావరి వరదల స్థితిగతులు తెలిసిన ఈ మండలాల ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమ భూములు నీటమునుగుతాయని గగ్గోలు పెడుతున్నారు.

పరిహారం ప్రశ్నార్థకమే.. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర విభజన సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధర వెలేరు, గణపవరం, ఇబ్రహీంపేట రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చింతూరు, వేలేరుపాడు, నెల్లిపాక, వీఆర్‌పురం మండలాలను కూడా ఏపీలో కలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య విలీన మండలాల అంశం కొనసాగుతూనే ఉంది. ఈ మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి నష్టపరిహారం అందించారు. అయితే భవిష్యత్తులో తెలంగాణలోని భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో మునిగిపోయే పంటలకు పరిహారం చెల్లింపులో తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో కలిపిన గ్రామాల్లో వరద ముంపునకు గురయ్యే భూములలోకి వరదనీరు చేరేటప్పటికీ గోదావరి, కిన్నెరసాని నదులకు ఇవతల ఉన్న తెలంగాణలోని బూర్గంపాడు మండలంలో వేలాది ఎకరాలు ముగునుతాయి. అయితే ఈ గ్రామాలకు పోలవరం ముంపు ప్యాకేజీ వర్తించడం లేదు. గోదావరి వరద వచ్చినప్పుడు మొదటగా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మోతె , ఇరవెండి గ్రామాలలోని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంపై స్పష్టత లేదు. భూములు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏమిటనేది స్థానికులకు ప్రశ్నార్థకంగా మారింది. కిన్నెరసానికి అవతల ఉన్న గ్రామాలు ఆం«ధ్రప్రదేశ్‌లో విలీనం కావటంతో అక్కడి ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తుంది. కాగా, కిన్నెరసాని, గోదావరి నదులకు ఇవతల ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ముంపు గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
వరదలను ప్రామాణికంగా తీసుకోవాలి..  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలవరం ముంపు భూములపై నీటిపారుదల శాఖ అధికారులు బూర్గంపాడు మండలంలో సర్వే చేశారు. ఈ మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని నిర్ధారించి అక్కడ సర్వే రాళ్లు పాతారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటంతో బూర్గంపాడు మండలం రెండు ముక్కలైంది. మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను లెక్కలోకి తీసుకుంటే ఏపీలో విలీనమైన గ్రామాల కంటే ప్రస్తుతం భద్రాచలం డివిజన్‌లోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. గతంలో గోదావరి వరదల ముంపు రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని మండల వాసులు కోరుతున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే మండలాల్లోని వ్యవసాయ భూములకు తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని, లేకుంటే మండలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. 

బాగా నష్టపోతాం 
సీతారామనగరం వైపు నాకున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు సర్వే చేశారు. అదే సమయంలో అంతకంటే ముందుగా మునిగే బూర్గంపాడు వైపు భూములకు ఎలాంటి సర్వే చేయలేదు. కిన్నెరసాని వరద కుడివైపు కంటే ఎడమవైపే ఎక్కువ నష్టం చేస్తుంది. అటు పరిహారం ఇచ్చి, ఇటు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి. – దారం వెంకటరెడ్డి, సంజీవరెడ్డిపాలెం
 
భూములన్నీ మునుగుతాయి
 
ప్రస్తుతం సీతారామనగరం వైపున ముంపునకు గురవుతాయని సర్వే చేస్తున్న భూముల ప్రకారం తీసుకుంటే బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలులో ఎక్కువ భూములు మునుగుతాయి. ప్రభుత్వాలు వేరైనా వరదముంపు మాత్రం భూముల లెవల్‌ను బట్టే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మేకల నర్సింహారావు, బూర్గంపాడు

మరిన్ని వార్తలు