బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ !

17 Jul, 2018 14:22 IST|Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌ :   కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధికారుల్లో నిర్లక్ష్యం ఎంతమేరకు పేరుకుపోయిందే తాజా సంఘటనే ఉదాహరణ. అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్న బల్దియా అధికారులు వివిధ సర్టిఫికెట్ల జారీలోనే అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్‌ జారీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు సోమవారం కార్పొరేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాడు.

కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ జమాలొద్దీన్‌తవక్కళికి బతికుండానే డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న జమాలొద్దీన్‌ 1977 జనవరి 28న చనిపోయినట్లు 2017లో సర్టిఫికెట్‌ జారీ కాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జమాలొద్దీన్‌తవక్కళి 1962 మార్చి 4న జన్మించారు. అంధుడైన జమాలొద్దీన్‌ 1991 డిసెంబర్‌లో ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరారు.

జమాలొద్దీన్‌తవక్కళి తండ్రి ఖాసీమొద్దీన్‌ పేరిట ఉన్న ఉమ్మడి ఆస్తిని సోదరుడు  సిరాజొద్దీన్‌ కుమారుడు ఇలియాసొద్దీన్‌ విక్రయించాడు. తనకు తెలియకుండా ఉమ్మడిఆస్తిని అమ్మడంతో జమాలొద్దీన్‌ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే జమాలొద్దీన్‌ పదిహేనేళ్ల వయస్సులోనే చనిపోయినట్లు సర్టిఫికెట్‌ పెట్టి తమకు వారసులు లేరని నమ్మించి ఇతరులకు రిజిస్ట్రేషన చేసినట్లు వెలుగుచూసింది.

డెత్‌ సర్టిఫికెట్‌లో తన తండ్రి పేరు ఖాసీమొద్దీన్‌కు బదులు ఖాసీంఅలీగా ఉందని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆస్తిని అమ్ముకునేందుకే తన అన్న కుమారుడు ఈ నీచానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండా సర్టిఫికెట్‌ ఎలా జారీచేస్తారని ప్రశ్నించారు.

సర్టిఫికెట్‌ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సదరు డెత్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డెత్‌ సర్టిఫికెట్‌ను చూపిస్తున్న బాధితుడు జమాలొద్దీన్‌ విచారణ జరిపిస్తాం 
కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ జమాలొద్దీన్‌ 1977లో చనిపోయినట్లు 2017లో డెత్‌ సర్టిఫికెట్‌ జారీ అయినట్లు ఫిర్యాదు అందింది.

డెత్‌సర్టిఫికెట్‌ ఎలా జారీ అయ్యిందనే విషయంపై విచారణ చేపట్టాలని కౌన్సిల్‌ సెక్రటరీ గౌతంరెడ్డికి ఆదేశాలు జారీ చేశాం. తప్పుడు సర్టిఫికెట్‌ అని తేలితే రద్దు చేస్తాం. తప్పుడు సర్టిఫికెట్‌ జారీ చేయడంలో ఉద్యోగులు బాధ్యులైతే చర్యలు తీసుకుంటాం.   – కె.శశాంక, కార్పొరేషన్‌ కమిషనర్‌   

మరిన్ని వార్తలు