1998 డీఎస్సీ అర్హులకు పోస్టులు ఇవ్వాల్సిందే

3 Oct, 2019 03:23 IST|Sakshi

తేల్చి చెప్పిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ప్రతిభావంతుల జాబితాలోని అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ 2009 డిసెంబర్‌ 4న ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల్ని అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులను ఇటీవల సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నవీన్‌రావు విచారించారు.

అనంతరం నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో)లకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే. ఈ శిక్షలపై కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల డీఈవోలు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం ఇటీవల విచారించింది. 4 వారాల్లోగా 1998 డీఎస్సీ అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పటి వరకూ సింగిల్‌ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాల అమలును నిలుపుదల చేసింది.

మరిన్ని వార్తలు