‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’

3 Oct, 2019 03:16 IST|Sakshi

ప్రేమించాడు. పెళ్లయ్యాక ఫస్ట్‌ నైటే తొలి ముద్దు అన్నాడు. అమ్మాయి ఆనందంలో తేలిపోయింది. ‘తగినవాడు’ అనుకుంది.  కానీ లాస్ట్‌ మినిట్‌లో ‘నేను తగనివాణ్ణి’ అన్నాడు.  ‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’ అన్నాడు.  అమ్మాయి షాక్‌ తింది. అది పట్టించుకోలేదు అతను.  ‘‘ప్లీజ్‌.. నువ్వే మన పెళ్లి చెడగొట్టాలి’’ అన్నాడు!

రిసార్ట్‌ అన్నారు గానీ అది రిసార్ట్‌లా లేదు. బీచ్‌ ఒడ్డున నాసి రకం షెడ్లు వేసి రూముల్లాగా చేశారు. రెండు మూడు కుర్రాళ్ల టీములు – వైజాగ్‌ వాళ్లట – పార్టీ చేసుకోవడానికి స్టే చేసి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన హైదరాబాద్‌ కుర్రాళ్ల టీములో ఒకరిద్దరు ఉత్సాహంగా ఉన్నా ఒకరిద్దరు బెరుగ్గా ఉన్నారు. ‘రాత్రికి ఉంటుంది మజా’ అన్నాడు హైదరాబాద్‌ టీమ్‌లోని ఒక కుర్రాడు. ‘జాగ్రత్త... పోలీసులు సడన్‌గా రావచ్చు. మీ మంచికే చెప్తున్నాను’ అన్నాడు బీర్లు తెచ్చి పెట్టిన బోయ్‌. రాత్రయ్యింది. రిసార్ట్‌లో మసక చీకటి అలుముకుంది. అక్కడక్కడ రూముల్లో సందడి వినిపిస్తూ ఉంది. హైదరాబాద్‌ టీములోని కుర్రాళ్లు వాళ్లలోని ఒకతన్ని గదిలోనే వదిలి మిగిలినవాళ్లంతా బయటకు వచ్చేశారు. ‘ఎంజాయ్‌ మామా’ అని కేరింతలు కొట్టారు వాళ్లందరూ. గదిలో ఉన్న కుర్రాడు తన ఎదురుగా వచ్చి కూచున్న ఆమె వైపు క్యూరియస్‌గా చూశాడు. లేడీ సైకియాట్రిస్ట్‌ రూములో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లీ కూచుని ఉన్నారు.

అమ్మాయి కళ్ల కింద చారలు ఉన్నాయి. ఏడెనిమిది రోజులుగా తిండి తింటున్నట్టుగా లేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఉంది. ‘నా ఖర్మ డాక్టర్‌. మూడు రోజుల్లో పెళ్లి. ఎలా తయారయ్యిందో చూడండి’ అంది తల్లి సైకియాట్రిస్ట్‌తో. ‘ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా?’ అడిగింది సైకియాట్రిస్ట్‌.‘లేదండీ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. ఆఫీసులో కలీగ్స్‌. ప్రేమించుకున్నారు. వాళ్లకై వాళ్లొచ్చి అడిగితేనే పెద్దలం ఓకే అన్నాం’ ‘ఏమ్మా... ఏంటి ప్రాబ్లమ్‌’ అడిగింది సైకియాట్రిస్ట్‌. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ‘మీరు బయట కూచోండి. నేను కనుక్కుంటాను’ అంది సైకియాట్రిస్ట్‌. ‘నువ్వు ఈ కాలం అబ్బాయివి కావు’ అంది మాన్విత శిరీష్‌తో. ‘నేను ఈ కాలం అబ్బాయినే’ ఉడుక్కుంటూ అన్నాడు శిరీష్‌. ‘నీ మొహం. సర్పంటైన్‌ పబ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ ఉందో చెప్పు?’ ‘తెలీదు. నీకు తెలుసా?’ కంగారుగా అడిగాడు. ‘తెలీదు. వెళ్లలేదు. కంగారు పడకు. నా ఫ్రెండ్స్‌ ఎవరో వెళితే దాని గురించి తెలిసింది. అందులో రాక్‌ మ్యూజిక్‌లూ పాప్‌ మ్యూజిక్‌లూ ఉండవు. ఎంచక్కా ఒక తబలా ఒక హార్మోనియం పెట్టుకొని ఎంకి పాటలు పాడతారు. బీరులోకి అరటికాయ బజ్జీలు ఇస్తారట’ నవ్వింది. ‘ఏమో... అదంతా నాకు తెలియదు. ఆఫీసవగానే నేరుగా ఇంటికెళ్లిపోతాను’ ‘వెళ్లి జబర్దస్త్‌ చూస్తావు.

అంతేగా?’ ‘అరె.. నీకెలా తెలుసు?’ ‘సుబ్బారావ్‌... అందుకే నువ్వంటే నాకిష్టం’ శిరీష్‌ బుగ్గను పిండింది మాన్విత. ఒక శాటర్‌ డే మాన్వితను కారులో లాంగ్‌ డ్రైవ్‌కు తీసుకెళుతూ శిరీష్‌ మాన్వితతో చెప్పాడు– ‘నేను ఇంటర్‌ చదివే రోజుల్లో ఎంసెట్‌లో ర్యాంక్‌ కోసం సాయంత్రాలు డాబా మీదకు వెళ్లి చదువుకునేవాణ్ణి. రాత్రి ఎనిమిదీ ఎనిమిదిన్నర టైములో పక్కింటామె పనంతా ముగించి స్నానానికి వెళ్లేది. వాళ్లది ఓపెన్‌ టాప్‌ బాత్‌రూమ్‌. నేను సరిగ్గా నిలబడితే పూర్తిగా కనిపిస్తుంది. కాని నేను ఒక్కసారి కూడా చూడలేదు. చూడకూడదు అనుకున్నాను. బి.టెక్‌ చేస్తున్నప్పుడు మా బేచ్‌మేట్‌ ఒకమ్మాయి నాకు ఐ లవ్‌ యూ చెప్పింది. కాని ఆ అమ్మాయి పట్ల నాకేమీ ఫీలింగ్స్‌ లేవు. సారీ అన్నాను. అయితే ఒక ముద్దన్నా పెట్టు అంది. పెట్టను అన్నాను. నేను పెట్టే ముద్దు నేను చేసుకోబోయే అమ్మాయికే పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు ఈ కారులో నువ్వూ నేనూ తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు.

కాని మన పెళ్లయ్యాక నువ్వు పాల గ్లాసు తీసుకొని వచ్చాక కొత్త పెళ్లి కూతురిగా ఉన్నప్పుడు నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకున్న మెమొరీ లైఫ్‌లాంగ్‌ బాగుంటుంది కదా’... మాన్విత కళ్లల్లో ఎందుకో అతని పట్ల విపరీతంగా ఆరాధన పెరిగి తడి ఉబికింది. ‘సుబ్బారావ్‌... సుబ్బారావ్‌’ తలలోకి వేళ్లు దూర్చి అల్లరిగా జుట్టును చెదరగొట్టింది. ‘తర్వాత?’ అడిగింది సైకియాట్రిస్ట్‌. ‘అతను పెళ్లి చేసుకోను అంటున్నాడు’ ‘అదేంటి?’ ‘నన్నే పెళ్లి చెడగొట్టమంటున్నాడు. నాతో మాట్లాడటం లేదు. నా ఫోన్‌ ఎత్తడం లేదు. మూడ్రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏం ఎరగనట్టు ఇవాళ ఆఫీసుకు కూడా వెళ్లాడు’ ‘విచిత్రంగా ఉంది’ ‘నాకు చచ్చిపోవాలని ఉంది’ ‘రేయ్‌ మామా... అసలే ఆ అమ్మాయి స్పీడు. నువ్వేమో పప్పు. ఫస్ట్‌నైట్‌ తెల్లముఖం వేశావంటే తర్వాత మా పరువు పోతుంది’ అన్నారు శిరీష్‌ ఫ్రెండ్స్‌. ‘అలా ఏమీ ఉండదు. మన తాత ముత్తాలంతా ప్రాక్టీసు చేసే పెళ్లిళ్లు చేసుకున్నారా? నేచరే అన్నీ నేర్పుతుంది’‘చెట్లు కొట్టేసి, కొండలు తవ్వి రోడ్లు వేసేశాక ఇంకా నేచర్‌ ఎక్కడుంది? అదేం నేర్పుతుంది’ జోక్‌ చేశాడో ఫ్రెండు.

‘మగాడు కొన్ని తెలియడం వల్ల చెడిపోతాడు. కొన్ని తెలియకపోతే చెడిపోతాడు’మొత్తానికి అందరూ శిరీష్‌ని బెదరగొట్టి రిసార్ట్‌ ప్రోగ్రామ్‌ పెట్టారు.‘అది శిరీష్‌ చేసిన తప్పు డాక్టర్‌. అక్కడ అతను ఫెయిల్‌ అయ్యాడు. ఏమీ చేయలేకపోయాడు. అది చాలా దెబ్బ కొట్టింది అతని కాన్ఫిడెన్స్‌ మీద. కాని అతడు ఎంత మంచివాడంటే వెంటనే హైదరాబాద్‌ వచ్చి జరిగింది నాతో చెప్పి పెళ్లి చేసుకోలేనని డిక్లేర్‌ చేశాడు. ఇక మీదట ఎవర్నీ చేసుకోనని కూడా చెప్పేశాడు. ఇరవై నాలుగ్గంటలూ కెరీర్‌ మీద దృష్టి పెడతాడట. అదే జీవితం అనుకుంటాడట’ మాన్విత ఏడ్చింది. ‘ఆపు. అనవసరంగా ఏడుస్తున్నావు. లేచి బయటికెళ్లి ఇప్పుడు మీ అమ్మను పంపు. రేపు ఆ సుబ్బారావ్‌ను పంపు’ అంది సైకియాట్రిస్ట్‌. తల్లికి జరిగిందంతా చెప్పి కూతురుకు ఎలా ధైర్యం చెప్పాలో సలహా ఇచ్చింది సైకియాట్రిస్ట్‌. మరుసటి రోజు సైకియాట్రిస్ట్‌ ఎదురుగా కూచుని ఉన్నాడు శిరీష్‌. ‘చూడు శిరీష్‌.. ఇంత సంస్కారం ఉండి డిస్టర్బెన్స్‌ తెచ్చుకున్నావ్‌.

ఇంటర్‌కోర్స్‌ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంపూర్ణ అంగీకారం, పరిచయం, ప్రేమ ఉన్న మనుషుల మధ్య అవరోధాలు లేకుండా జరుగుతుంది. లేదంటే నీలా జరుగుతుంది. నీకున్న జబ్బును పెర్‌ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ అంటారు. కొత్త వాతావరణం, ఎవరో తెలియని స్త్రీ, రోగ భయం, పోలీసుల భయం... వీటిన్నింటి వల్ల నువ్వు ఫెయిలయ్యావు తప్ప నీలో లోపం ఉండి కాదు. ఇక మీదట ఎప్పుడూ ఇలా చేయకు. ధైర్యంగా ఉండు. సరేనా’ అంది.అప్పటి వరకూ కుంగిపోయి ఉన్న శిరీష్‌లో ఆ మాటలతో వెలుగు వచ్చింది. ‘థ్యాంక్యూ డాక్టర్‌. మరి మెడిసిన్లు ఏమైనా వాడాలా?’ అడిగాడు. ‘అవును. వాడాలి’ అని ఆమె ప్రిస్క్రిప్షన్‌ మీద రాసి ఇచ్చింది. చూశాడు.‘పెళ్లి’ అని ఉంది. శిరీష్, మాన్విత పెళ్లి చేసుకున్నారు. వాళ్లు సంతోషంగా ఉన్నారనడానికి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ అవుతున్న హనీమూన్‌ ట్రిప్‌ ఫొటోలే సాక్ష్యం.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బొప్పాయి ప్యాక్‌

మహిళలు ముందుకు సాగాలి!

విజయలక్ష్మిగారిల్లు

బ్యాక్టీరియాతో ఒత్తిడికి ఔషధాలు..

రోజూ చూడండి... అప్పుడప్పుడు మాత్రమే వండుకోండి

సోరియాసిస్‌కు చికిత్స ఉందా?

ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం

బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌

మహాత్ముడిని మలిచిందెవరు?

నాటకంలో గాంధీ బాట

గాంధీ ముస్లిం భాయ్‌.. భాయ్‌ 

కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ...

విజయ తీరాల ‘తెర’చాప

ఆయన కళగన్నారు

గాంధీ మార్గంలో పల్లెను మళ్లిదాం..

‘స్వచ్ఛ’మేవ జయతే

‘నాలుక’ను జయించి

నయా నిజం..గాంధీయిజం

లైలా..మజ్ను

మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!

పర్యాటక రంగంతో శాంతికి ఊతం

నీడల ఊడ

సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు

ఆమె భార్య అయ్యాక

ఒప్పుకునేవాడే మహాత్ముడు..

తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.

ఆశయాల లేఖనం

గ్రేటర్‌ గృహాలంకరణ

ధైర్యం చేసి రాశా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు విజయ్‌ తండ్రిపై ఫిర్యాదు

డిన్నర్‌ కట్‌

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌