వేలాది ఎకరాల్లో ఒరిగిపోయిన మొక్కజొన్న

3 Apr, 2018 12:45 IST|Sakshi
తల్లాడలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు

తల్లాడ: ఆదివారం రాత్రి అకాల వర్షం, వడగండ్ల వాన, గాలి బీభత్సానికి మండలంలో సాగు చేసిన మొక్కజొన్న పైరు నేలకొరిగి పోయింది. మూడు నెలలుగా సాగు చేసిన మొక్కజొన్న పైరు కంకి వేసి కోత దశకు వచ్చింది. మండలంలో 4,490 ఎకరాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. మరో పది రోజుల్లో కంకులు ఎండి మిషన్‌తో కోయవచ్చని రైతులు భావించారు.

ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వచ్చిన వర్షం, గాలి బీభత్సానికి మొక్కజొన్న పైరు నేలకొరిగిపోయింది. మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట నాశనం అయ్యింది. ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశ మిగిలింది. తల్లాడ, నారాయణపురం, అన్నారుగూడెం, రెడ్డిగూడెం, ముద్దునూరు, రామానుజవరం, కుర్నవల్లి, రంగంబంజర, రేజర్ల, బాలప్పేట, పినపాక, మంగాపురం గ్రామాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. అకాల వర్షం ఈ ఏడాది మొక్కజొన్న పంటను రైతులను నట్టేట ముంచింది.  
మామిడి, మిర్చి రైతులకూ నష్టం..  
గాలివానకు మండలంలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కోసి కల్లాల్లో ఉంచిన మిర్చి కూడా కొన్ని చోట్ల తడిచిపోయింది. ఎండబెట్టిన మిరపకాయలు చెల్లా చెదురయ్యాయి.

తల్లాడలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు

మరిన్ని వార్తలు