వైద్యం.. దైన్యం

27 Dec, 2014 01:25 IST|Sakshi

జిల్లాలో ఈ ఏడాది ప్రజా వైద్యం ఒడిదుడుకులకు లోనైంది. ఎన్నడూ లేనివిధంగా డెంగీకి ముగ్గురు చనిపోయారు. డయోరియా, మలేరియా, విజృంభించాయి. 27 మంది చనిపోయారు. వైద్యవిధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రులు ఓపీలకే పరిమితమయ్యాయి.  వైద్య విద్యకు మాత్రం కలిసొచ్చింది. జిల్లా కేం ద్రంలోని వైద్య కళాశాలకు రెండవ సంవత్సరం ఎంబీబీఎస్‌కు అనుమతి లభించింది.ఉప ముఖ్యమంత్రి సందర్శించిన జిల్లా ఆస్పత్రి తీరుమారలేదు.  

విజృంభించిన డెంగీ
వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో వ్యాధులు విజృంభించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ తీవ్రప్రభావం చూపింది. అధికారుల లెక్కల ప్రకారమే ముగ్గురు డెంగీ బారిన పడి చనిపోయారు. మొత్తం 115 కేసులు నమోదయ్యాయి. బోధన్‌లోని రాకాసిపేటలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. గీత అనే మహి ళ ప్రాణాలు కోల్పోయింది. జిల్లాకేంద్రం, బాన్సువాడ, మోర్తాడ్, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, ఆర్మూర్ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి.

2013లో జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 115కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు వివిధ రకా ల వ్యాధులు గ్రామీణ ప్రజలను పీడించాయి. డయేరియా-61, మలేరి యా-216, విషజ్వరాలు-281, ఇతర వ్యాధులు నమోదయ్యాయి. వివిధ వ్యాధుల కారణంగా 27మంది చనిపోయారు. ఈలెక్క అనధికారికంగా 100కు పైగా ఉండొచ్చు.
 
ప్రైవేటు ఆస్పత్రుల నిరసన
ఈ ఏడాది పలు ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల శైలి వివాదస్పదంగా మారింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతిచెందడంతో, అనంతరం వారి రోగి బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. దీంతో ఆగ్రహించిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు నాలుగు రోజుల పాటు తమ సేవలను నిలిపివేసి, నిరసన తెలిపారు. దీంతో వైద్యం అందక ధర్పల్లికి చెందిన జ్యోత్స్న అనే బాలిక మృతి చెందింది. దీంతో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల వారు వైద్యుల తీరుపై మండిపడ్డారు.
 
వైద్యశాఖలో మార్పు లేదు
జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 375 ఉపకేంద్రాలు ఉన్నాయి. 120 మంది వైద్యులు , 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఖాళీల కొరత తీవ్రంగా ఉండటం వైద్యసేవలపై ప్రభావం పడింది. తెలంగాణ ఏర్పడడం, కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని వైద్యశాఖకు చెందిన 430మంది భావించారు. కానీ వారి కల ఈ ఏడాదికి నెరవేరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవల కోసం చేపట్టిన 104 సేవలు నామమాత్రంగానే కొనసాగాయి. ఈ ఏడాది కొత్తగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తొమ్మిది సంచార వైద్యబృందాలు ఏర్పాటు చేశారు.
 
కళాశాలకు కలిసొచ్చింది

జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు 2014 కలిసొచ్చింది. ఈ ఏడాది కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరానికి అనుమతి లభించింది. ఫిబ్రవరి, మే నెలల్లో తనిఖీ చేసిన ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం జులై 16న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 సీట్లతో అనుమతిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 6న డీఎన్‌బీ(డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డు) కోర్సుల ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ కళాశాలకు మెడిసిన్, గైనిక్, సర్జరీ, ఫిజిషియన్, మత్తుమందు వైద్య కోర్సుల ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి.

డిసెంబర్‌లో అదనంగా 50ఎంబీబీఎస్ సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎంసీఐ సానుకూలంగా స్పందించింది. కళాశాలకు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం కేటాయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగింది. నర్సింగ్‌కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి చేశారు. కానీ పోస్టుల భర్తీని మాత్రం ఇప్పటి వరకూ చేపట్టలేదు. వివిధ విభాగాల కోసం సుమారు 200 మంది  ఉద్యోగుల నుంచి డిప్యూటేషన్ ఆప్షన్లు తీసుకున్నారు. కానీ విధుల్లో మాత్రం చేరలేదు. దీంతో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది.

ఈ ఏడాది మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్లు, పీజీ వైద్యుల కేటాయింపు జరిగింది. దీంతో 200 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చినట్లయింది. సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు -109 మంది, కళాశాలకు కేటాయించబడిన-110 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేటాయించబడ్డారు. కానీ వైద్యులు మాత్రం ఆస్పత్రికి వచ్చి సేవలు అందించడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం 30 నుండి 35 మంది వైద్యులే అందుబాటులో ఉంటున్నారు. కలెక్టర్, డీఎంఈ హెచ్చరించినా వైద్యుల తీరులో మార్పు రాలేదు.
 
వైద్య‘విధానం’ మారలేదు

జిల్లాలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రుల్లో ఈ ఏడాది మెరుగైన పరిస్థితులు నెలకొనలేదు. ఆస్పత్రులన్నీ కేవలం అవుట్ పేషెంట్ విభాగాలకే పరిమితమయ్యాయి. మెడికల్ కళాశాల ఏర్పడిన తర్వాత వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలో బదిలీ అవుతుందని ప్రకటించినా ఇప్పటికీ జరగలేదు. దీంతో మెడికల్ కళాశాల వైద్యులు , వైద్య విధాన పరిషత్ వారి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, మద్నూరు, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లోనూ ఖాళీల కొరత వేధిస్తోంది. జిల్లాలో 36 మంది వైద్యులు, 32 స్టాఫ్‌నర్సులు, 52 మంది నాల్గోతరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజీ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించి, అత్యవసర చికిత్సకు సంబంధించి సేవలు అందడం లేదు. ఏరియా  ఆస్పత్రులకు రెగ్యులర్ డీసీహెచ్‌ఎస్ లేక రెండేళ్లు గడుస్తోంది.

మరిన్ని వార్తలు