Dengue Fever: డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?

16 Oct, 2023 15:49 IST|Sakshi

ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్‌ల కారణంగా డెంగ్యూ ‍జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌ (ప్రమాదకరమైనది).

డెంగ్యూ వ్యాధి లక్షణాలు

  • ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం
  • తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి
  • కండరాలు, కీళ్ళ నొప్పి 
  • వాంతులు అవుతున్నట్లు అనిపించడం
  • డీహ్రైడ్రేషన్‌కు గురి కావడం
    పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్‌లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్‌ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. 


వ్యాధి వ్యాపించే విధానం
ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది.
ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. 
ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్‌ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. 

 డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది.

ప్లేట్‌లెట్‌లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు.
30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు.
♦  20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్‌ విపరీతంగా అవుతుంది.
కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్‌లెట్‌ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం.
♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. 
డీహైడ్రేషన్‌కు గురి కాకుండా లిక్విడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. 

డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా..

వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. 

► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్‌ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్‌ అందుకు కారణం అని తేల్చారు. 

► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. 

తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది.  
లెమన్ గ్రాస్‌ ఆయిల్‌: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్‌ ఆయిల్‌ను చాలాకాలంగా ఉప­యో­గిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది.  
లావెండర్‌ ఆయిల్‌: చర్మంపై లావెండర్‌ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు  కుట్టవు.
పిప్పరమింట్‌ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. పిప్పరమింట్‌ ఆయిల్‌ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 
యూకలిప్టస్‌ ఆయిల్‌: నిమ్మకాయ,యూకలిప్టస్‌ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని  శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. 

-నవీన్‌ నడిమింటి
ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. )

మరిన్ని వార్తలు