ఛీతా.. ఇట్టే పసిగట్టేస్తోంది

18 Jan, 2019 09:32 IST|Sakshi
మంచిర్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో డాగ్‌స్క్వాడ్‌, అటవీ ప్రాంతంలో కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శరవణన్, డాగ్‌స్క్వాడ్‌ సభ్యులు

వేటగాళ్లు, స్మగ్లర్లను గుర్తించడంలో డాగ్‌స్క్వాడ్‌ కీలకం

పక్షం వ్యవధిలో చిరుత నిందితుల పట్టివేత

సాక్షి, మంచిర్యాలఅర్బన్‌: వేటగాళ్లు, కలప స్మగర్లపై అటవీశాఖ నిఘా పెంచింది. అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు అధికారులు ఇటీవల డాగ్‌స్క్వాడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. పక్షం వ్యవధిలో రెండు చిరుత పులులను చంపిన నిందితులతో పాటు వన్యప్రాణి మాంసం, కలప స్మగర్లును పట్టుకోవడంలో ఈ డాగ్‌స్క్వాడ్‌ కీలకంగా వ్యవహరించిది. ఛీతా (జాగిలం) వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక కేసుల్లో నిందితులను పక్కాగా పసిగట్టి చేధిస్తుండటంతో డాగ్‌స్క్వాడ్‌పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో తొలిప్రయత్నంలో భాగంగా ఇద్దరు బీట్‌ అధికారులతో డాగ్‌స్వాడ్‌ ఏర్పాటు చేశారు. కలపస్మగ్లింగ్, వ్యన్యప్రాణుల వేట అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లో ఇచ్చిన శిక్షణకు జన్నారంనకు చెందిన అటవీ బీట్‌ అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్‌ వెళ్లివచ్చారు. గ్వాలియర్‌లోని బీఎస్‌ఎఫ్‌ కేంద్రంలో ఛీతాకు (జర్మన్‌ షెపర్డ్‌ శునకం)ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని డాగ్‌స్క్వాడ్‌ బృందం అడవికి కాపలా కాయడంతో పాటు నేరస్తుల అటకట్టించడంలో ముందు వరుసలో నిలుస్తోంది.

ఈనెల 4న జన్నారం అటవీ డివిజన్‌లో చింతగూడ బీట్‌ కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 360లో వన్యప్రాణిని హతమార్చిన కేసులో మొదట డాగ్‌స్క్వాడ్‌ బృందం నిందితులను పట్టుకున్నారు. చింతగూడ బీట్‌లో వన్యప్రాణిని హతమార్చిన అనవాలు లభించడంతో డాగ్‌స్క్వాడ్‌ వాసన చూసి బొమ్మన గ్రామానికి చెందిన మల్లయ్య కొట్టంలోని పొయ్యి వద్దకు వెళ్లడం.. తర్వాత వండిన మాంసం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అలాగే చింతగూడ పొలాల్లో దాచిన దుంగలను పట్టించింది ఈ డాగ్‌స్క్వాడ్‌ కావడం విశేషం. బొమ్మన గ్రామంలో రెండు టెకు దుంగలను స్వాధీనం పర్చుకున్నారు. ఈనెల 9న జన్నారం అటవీ రెంజ్‌ పరిధిలో డాగ్‌స్క్వాడ్‌తో కలిసి దాడి నిర్వహిæంచగా 0.328 సీఎంటీ విలువ గల కలప గుర్తించారు. ఈనెల 14న నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మామిడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద మృతి చెందిన కేసులో డాగ్‌స్క్వాడ్‌ ఎంతో కీలకంగా మారింది. పులి మృతి చెందిన స్థలం సమీపంలో ఉన్న బీడీల కట్ట, అంబర్‌ ప్యాకెట్‌ ఆధారంగా వాసనతో పసిగట్టి అనుమానితులను గుర్తించారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగపేట్‌ అటవీ ప్రాంతంలో క్లచ్‌వైర్‌తో అమర్చిన ఉచ్చులో పడి పులి మృతి చెందిన విషయం తెలిసిందే. చెప్పుల ఆధారంగా పసిగట్టి వేటగాళ్లకు ఉచ్చు బిగిసేలా చేయటం వెనక ఈ డాగ్‌స్క్వాడ్‌ కీలకం కావడం గమన్హారం.

డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
మంచిర్యాలఅర్బన్‌: లక్సెట్టిపేట్‌ అటవీ రెంజ్‌ పరిధిలోని ముల్కల్ల, వెంపల్లి, రంగంపేట్‌ నీటి పరివాహక ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. ఫీల్డ్‌ డైరెక్టర్‌ కవ్వాల్‌ టైగర్‌ ప్రాజెక్టు, నిర్మల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శరవణన్, ఎఫ్‌డీవో వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో కలప స్మగ్లింగ్‌తో పాటు వన్యప్రాణులకు హాని తలపెట్టే ఉచ్చులు ఏమైనా ఉన్నాయనే దానిపై డాగ్‌స్క్వాడ్‌తో నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే విద్యుత్‌ లైన్‌ వెంట కరెంట్‌ ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరిపారు. ఈ నెల 14న రంగంపేట్‌ అటవీ ప్రాంతంలో ఉచ్చుకు చిరుతపులి హతమైన విషయం విదితమే. ఈ మేరకు ఎఫ్‌డీవో వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమంలో భాగంగానే తనిఖీలు చేపట్టామని, శుక్రవారం కూడా డాగ్‌స్క్వాడ్‌తో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతామన్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్‌ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్సెట్టిపేట్, దేవాపూర్‌ అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు