కరోనా కట్టడికి డ్రోన్‌ అస్త్రం

7 Apr, 2020 10:35 IST|Sakshi
రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో డ్రోన్‌ను ప్రారంభిస్తున్న సీపీ మహేశ్‌ భగవత్‌

రెండు డ్రోన్‌ కెమెరాలను ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్‌

బాలాపూర్, పహడీషరీఫ్, మౌలాలీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు 

పోలీసు వాహనాలకు శానిటైజేషన్‌

సాక్షి, సిటీబ్యూరో: కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు రాచకొండ పోలీసులు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం డ్రోన్‌ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న బాలాపూర్, పహడీషరీఫ్, మౌలాలి ప్రాంతాల్లో ఈ ఆధునిక సాంకేతికత ద్వారా నిఘా ఉంచుతున్నారు. ఈ మేరకు సైయంట్‌ కంపెనీ సహకారంతో రెండు డ్రోన్‌ కెమెరాలను సోమవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో జనాల రద్దీ ఎలా ఉంది? భౌతిక దూరం పాటిస్తున్నారా.. లేదా? కర్ఫ్యూ సమయంలో మెడికల్‌ దుకాణాలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు పని చేస్తున్నాయా? మిగిలిన వ్యాపార సముదాయాలకు అనుమతి లేకున్నా తెరిచి ఉంటే డ్రోన్‌ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక ద్వారా ఇలా అన్ని విషయాలు తెలుసుకొని లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలుచేయవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మార్గదర్శనం చేసి సరైన నిర్ణయాల ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పాటునందిస్తాయని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఆయా డ్రోన్‌ కెమెరాలు ఫొటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా రాచకొండ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపిస్తాయన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ ప్రకటనలు కూడా చేయవచ్చని తెలిపారు. 

పోలీసు వాహనాలకు శానిటైజేషన్‌  
కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న వ్యక్తులను ఆస్పత్రులకు అంబులెన్స్‌ల ద్వారా వైద్య విభాగం అధికారులు తరలిస్తున్న సమయంలో.. వారికి రక్షణగా పోలీసులు కూడా వారి వాహనాల్లో వెళుతూ సేవలందిస్తున్నారు. ఆయా సమయాల్లో వాడుతున్న వాహనాలకు కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా వాటిని రసాయనాలతో స్ప్రే చేస్తున్నారు. ఈ మేరకు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో నాలుగు వాహనాలను శుభ్రపరిచారు. ఇందుకు హర్ష మోటార్‌ సహకారాన్ని తీసుకున్నామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు