ముందస్తుకు సై..!

26 Aug, 2018 10:37 IST|Sakshi

సాక్షి, యాదాద్రి(నల్గొండ) : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ నేతలకు ఇచ్చిన సంకేతాలతో ప్రతి పక్షాలు సైతం అలర్ట్‌ అయ్యాయి. షెడ్యూల్‌ కంటే ముందుగా వచ్చినా, నిర్ణీత తేదీల్లో జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన రాజకీ య పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. రాజకీయ చైతన్యానికి ప్రతిరూపంగా నిలిచే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏడాది క్రితం నుం చే ఎన్నికల హీట్‌ మొదలైంది.

తాజా పరిణామాలతో మరింత వేడెక్కాయి. అంతేకాకుండా సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో ఆపార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ తొలగిపోయింది. ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఎదురైతే తప్పా ఇప్పుడున్న ఎమ్మెల్యేలే తిరిగి రంగంలోకి దిగనున్నారు. అయితే ఎవరికి  టికెట్లు వస్తాయి, ఎవరికి రావు, రాకపోతే కారణాలేంటి, వస్తే గెలుస్తారా లేదా?  ఎవరి అర్థ, అంగ బలం ఎంత, కులాల సమీకరణ, రాజకీయ విభేదాలు, గ్రూపు తగాదాలు, గెలుపోటములను ప్రభావితం చేసే సమస్యలు ఇలా..  ఇప్పుడు గ్రామగ్రామాన చర్చనీయాంశంగా మారాయి.
 
జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘యాదాద్రి భువనగిరి’ సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమకాలం నుంచి జిల్లా టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా ఉం టూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించి దక్షిణ తెలంగాణలో తనకున్న పట్టును నిలుపుకుంది. దీంతోపాటు ఆయన ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణకు మంజూరైన ఎయిమ్స్‌ను బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద  ఏ ర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు యాదాద్రి వర కు ఎంఎంటీఎస్‌ పొడిగింపు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌తో యాదాద్రి రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచారు. వచ్చే డిసెంబర్‌ నాటికి కాళేశ్వరం డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా జిల్లాలోని  రైతులకు సాగు నీరందించే పనులు చేపట్టారు.
 
ఆత్మవిశ్వాసంతో అధికార పార్టీ
గడచిన నాలుగేళ్లలో జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు పథకం, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కంటివెలుగు, కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ వంటి పథకాలు తమను గెలిపిస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా..
ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు వంటి పథకాల వైఫల్యాను ఎండగట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనతో ఆ పార్టీ  కొంత జోష్‌ పెంచుకుంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృ తి, అసరా పింఛన్‌ను రూ.2వేలకు  పెంపు, ఇళ్లని ర్మాణానికి ప్రభుత్వ నిధుల మంజూరు, రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ వంటి ప్రధా న హామీలతో ముందుకు వెళ్లే యోచనలో ఉన్నా రు.

బీజేపీ సైతం ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించే  ప్రయత్నాలు చేస్తోంది. బీబీనగర్‌కు ఎయిమ్స్‌ మంజూ రు, ఆటల్‌పెన్షన్‌ యోజన, ఉజ్యల్‌ యోజన పథకంలో ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ల మంజూరు వంటివి ప్రచా రాస్త్రాలుగా మార్చుకోనుంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాలతోపాటు జిల్లా మూసీ ప్రక్షాళనకు  నిధులు కేటాయింపు లేకపోవడం,  ప్రభుత్వ పథకాల వైఫల్యాను ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది.

పోటీపడుతున్న నేతలు
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు. అన్ని సర్వేల్లోనూ ఆయన ముందున్నారు. కాంగ్రెస్‌నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్‌ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే టి కెట్‌ వస్తుందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాలతో ఆయన నిరంతరం జనంలో ఉంటున్నారు. ఇంటింటికీ కాంగ్రెస్‌ పేరుతో నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తున్నారు.

అయితే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్‌ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తె లుస్తోంది.బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆయన పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తూ ప్రజ ల్లో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిపాలైన జిట్టా బాలకృష్ణారెడ్డి మరోమారు రంగంలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇంకా మరికొందరు ఆశావాహులు అన్ని పార్టీల నుంచి రంగంలోకి దిగడానికి పావులు కదుపుతున్నారు.

దూకుడు పెంచిన నేతలు
ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విఫ్‌ గొంగిడి సునీత రంగంలోకి దిగనున్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో దూకుడు పెంచారు. సిట్టింగ్‌లకే సీట్లు అన్న కేసీఆర్‌ ప్రకటనతో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ రంగంలోకి దిగనున్నారు. గడప గడపకు కాంగ్రెస్‌ పేరుతో ఆయన ఏడాది ముందునుంచే ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గానికి చెందిన కొందరు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. పార్టీ టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇంకా పలువురు ఆశావాహులు ఇండిపెండెంట్‌గా నైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే
షెడ్యూల్‌ ప్రకారం ఎన్ని కలు జరిగితే టీఆర్‌ఎస్‌పై ప్రజల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని ముందస్తు ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ సిద్ధంగా ఉంది. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయిం ది. ఎటువంటి ఆరోపణలు లేని బీజేపీకి ప్ర జలు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉన్నాం. – గంగిడి మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు