కాయ్‌.. రాజా కాయ్‌!

20 Nov, 2018 13:34 IST|Sakshi

ఒకటికి రెండు..  రెండుకు నాలుగు

ఎన్నికల వేళ జిల్లాలో జోరుగా బెట్టింగ్‌

అభ్యర్థుల ఖరారు నుంచి ఫలితాల వరకూ..

పందెం కాస్తున్న వ్యాపారులు, నేతలు, యువకులు 

సాక్షి,ఆర్మూర్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల ఖరారు నుంచే పందెంరాయుళ్లకు పండగ మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటి నుంచే బెట్టింగ్‌ జరుగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికలు, అభ్యర్థుల ప్రచారం, విజయవకాశాలపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడం, నామినేషన్ల పర్వం ముగియడం బెట్టింగ్‌ మరింత జోరందుకోనుంది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, బలహీనతలపై ప్రజలు, రాజకీయ విశ్లేషకుల మధ్య ప్రధానంగా చర్చ జరుగుతోంది.

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ బెట్టింగ్‌ జోరు కొనసాగుతోంది. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్త బస్టాండ్, అంబేద్కర్‌ చౌరస్తా, పాత బస్టాండ్, గోల్‌బంగ్లా వద్ద బెట్టింగ్‌ జోరుగా నడుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లా చైన్‌ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్‌ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఈ బెట్టింగ్‌ల జోరు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో బెట్టింగ్‌ల జోరు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు సమాచారం. తమ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించారు.

ఆర్మూర్‌ ప్రాంతంతో పాటు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లు, మట్కా, జూదం విచ్చలవిడిగా సాగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలు ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపోటములపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం ఫలానా అభ్యర్థి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5వేల నుంచి మొదలు కొని రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు. రూ. లక్ష బెట్టింగ్‌ కాసి, విజయం సాధిస్తే అతని ప్రత్యర్థి రూ.లక్షకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.  

ఆర్మూర్‌ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములతో పాటు రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు సైతం స్వీకరిస్తాడంటూ.. కావలిస్తే బెట్‌ కట్టండి అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైం పాస్‌ వ్యవహారంగా మారింది. రూ.5 వేలకు రూ.20 వేలు, రూ.లక్షకు రూ.2 లక్షలు.. ఇలా బెట్టింగ్‌ కాస్తూ తాము గెలుస్తాడని నమ్మిన నాయకుని విజయావకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.

మరిన్ని వార్తలు