‘కాసు’కో లెక్కుంటది!!

15 Nov, 2018 14:28 IST|Sakshi

అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి రూ.28 లక్షలు

ఎన్నికలయ్యే వరకు ఖర్చుల వివరాలు తెలపాలి

మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌

ఇందుకోసం ఇప్పటికే జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

మంచిర్యాలటౌన్‌: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు చేసే ఖర్చుపై రోజూ లెక్క చెప్పాల్సిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్రా ఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఏయే పద్దు కింద ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే విషయాలను కూడా స్పష్టం చేసింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈనెల 12న నామినేషన్ల ప్రారంభం నుంచే అమలులోకి వచ్చాయి. ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు అన్ని జిల్లాలకు ఇప్పటికే ఎన్నికల వ్యయ పరిశీలకులు వచ్చారు. 
 

ప్రతీ పైసాకు లెక్క..  
గతంలో ఎన్నికల ఖర్చును మూడురోజులు, లేదా వారానికోసారి లేదా పోలింగ్‌ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌ వరకు కూడా లెక్క చూపే అవకాశం ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాము చేస్తున్న ఖర్చును రోజువారీగా తప్పని సరిగా లెక్క చూపించాలనే నిబంధన అమలులోకి వచ్చింది. ఖర్చుల వివరాల ప్రతులను జిల్లా ఎన్నికల అధికారికి విధిగా ఎప్పటికప్పుడు తెలపాలి. అంతేకాకుండా ఈ వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్‌సైట్‌లో కూడా ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను కూడా అఫిడవిట్‌లో నామినేషన్‌ సమయంలో విధిగా నమోదు చేయాలని పేర్కొంది.

రోజూవారీ కిరాయిల బిల్లు, ఇతర ఖర్చులను కూడా విచ్చలవిడిగా చూపించే అవకాశం లేదు. దేనికి ఎంత బిల్లు చెల్లించాలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ బిల్లులు చూపితే అనుమతించబడదు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు ఖర్చులను పరిమితం చేసింది. రూ.28 లక్షలకు మించి ఖర్చు చేసినా, ఖర్చుల లెక్కలను చూపకపోయినా వేటు తప్పదని కఠినంగా హెచ్చరిస్తున్నారు. లెక్కలు చూపకుండా గెలిస్తే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు.
 

ఖర్చు నిబంధనలు..

  •  అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటి నుంచి గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీ లేదా కృతజ్ఞత ర్యాలీ వరకు రూ.28 లక్షలు ఖర్చు పెట్టొచ్చు.
  •  పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు తన ఏజెంట్‌ పేరుతో బ్యాంకు అకౌంట్‌ తెరవాలి.
  •  ఈ అకౌంట్‌లో మొత్తం రూ.28లక్షలు జమ చేయాలి. ఈ మొత్తంలో తాను సొంతంగా ఇచ్చినది, పార్టీ పంపించిన, ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. రూ.20 వేలలోపు అయితే నగదు       రూపంలో, రూ.20వేలు దాటితే చెక్‌ రూపంలో డిజిటల్‌ ఫార్మట్‌లో జమ చేయాల్సి ఉంటుంది.
  •  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 40 మంది వరకు స్టార్‌ క్యాంపెయినర్లను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు 20 మంది వరకు స్టార్‌ క్యాంపెయినర్లను పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ స్టార్‌     క్యాంపెయినర్లు వాడుతున్న హెలికాప్టర్‌ లేదా ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రయాణిస్తే ఆ ఖర్చులో సగం అభ్యర్థి వ్యయంలో కలుపుతారు.
  •  స్టార్‌ క్యాంపెయినర్లు నిర్వహించే బహిరంగ సభలో ఒక అభ్యర్థితోపాటు ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఆ వేదికపై కనిపిస్తే బహిరంగ సభ ఖర్చు అభ్యర్థులకు సమానంగా పంచుతారు. 
  • ఎన్నికల సమయంలో అభ్యర్థికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో మూడు రకాల పేజీలుంటాయి. మొదటి పేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాకు సంబంధించిన  వివరాలు, మూడో పేజీలో అభ్యర్థి పెట్టిన ఖర్చుల వివరాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అభ్యర్థి తరఫు ఏజెంట్‌ నింపాల్సి ఉంటుంది.
  •   ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత అభ్యర్థులు లేదా ఏజెంట్లు అకౌంట్స్‌ అధికారులతో సమావేశమైన, నమోదైన ఖర్చులను సరిచూసుకోవాలి.
  •  అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కనీసం మూడు సార్లు అభ్యర్థి ఖర్చులను బిల్లులతో సహా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉన్న అకౌంట్‌ విభాగంలో   సమర్పించి సరి చూసుకోవాలి. ఆ సమయంలో అకౌంట్‌ సిబ్బంది ఖర్చులను తమ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేస్తారు. అభ్యర్థికి తెలియకుండా షాడో టీం సభ్యులు అభ్యర్థి ఖర్చుపై నిఘా   పెడుతారు. ఆ విషయాన్ని అభ్యర్థి తరఫు ఏజెంట్‌కు తెలియజేస్తారు. ఖర్చు విషయాన్ని సరి చూసుకొని భవిష్యత్‌ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థి తరఫున         ప్రచారం చేయడానికి వాహనాలు, బహిరంగ సభల అనుమతులు రద్దు చేస్తారు.
  •  అభ్యంతరాలు ఉంటే కౌంటింగ్‌ పూర్తయిన 26వ రోజున ఎన్నికల అధికారులు అభ్యర్థికి లేదా ఏజెంట్లకు తెలియజేస్తారు. అభ్యర్థులు గానీ వారి ఏజెంట్లు గానీ కౌంటింగ్‌ జరిగిన 30వ రోజులోపు              అకౌంట్‌ను సరి చూసుకోని సమర్పించాలి.
  •  అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటినా, అభ్యర్థులు ఎన్నికల ఖర్చును సమర్పించకపోయినా వారి సభ్యత్వం రద్దవుతుంది. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
     


ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చులివే..
లౌడ్‌ స్పీకర్లు అద్దె కోసం రూ.2,300, సభ ఏర్పాటుకు రూ.5 వేలు, ఫ్లెక్సీ బ్యానర్‌ సైజ్‌ 10–12కు రూ.2వేలు, క్లాత్‌ బ్యానర్‌కు రూ.300లు, క్లాత్‌తో చేసే ఫ్లాగ్‌లకు రూ.50, ప్లాస్టిక్‌ ఫ్లాగ్‌లకు రూ.10, హ్యాండ్‌బిల్‌కు రూ.1,650, పోస్టర్‌ సింగిల్‌ కలర్‌కు రూ.10, పోస్టర్‌ మల్టీకలర్‌కు రూ.12, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసేందుకు లేబర్‌ చార్జీలను కలుపుకుని రూ.11 వేలు, వుడెన్‌ కటౌట్ల ఏర్పాటు, కూలీ ఖర్చులకు కలిపి రూ.12 వేలు, క్లాత్, ప్లాస్టిక్‌ కటౌట్లకు రూ.7 వేలు, వీడియో, ఫొటోగ్రాఫర్‌కు రూ.2,500లు, ప్రతీరోజు వాహనాలకు చెల్లించాల్సింది జీపు డ్రైవర్‌ బత్తాతో కలిపి రూ.2 వేలు, టెంపో, ట్రక్‌కు రూ.4,500లు, సుమో ఒక్కరోజుకు ఏసీకి రూ.4,200లు, నాన్‌ఏసీకి రూ.2,500లు, వ్యాన్‌ ఒక్క రోజుకు రూ.5,100, క్వాలీస్‌ ఒక్క రోజుకు ఏసీ రూ.2,500లు, నాన్‌ ఏసీ రూ.2,300లు, ఇన్నోవా ఒక్కరోజుకు రూ.3,500, కారు ఒక్క రోజుకు రూ.1,700, త్రీవీలర్‌ ఒక్క రోజుకు రూ.1,000, హోటల్‌ రూం ఒక్క రోజుకు ఏసీ అయితే రూ.2,500, నాన్‌ ఏసీ అయితే రూ.1,000, గెస్ట్‌హౌస్‌కు రూ.500, డ్రైవర్‌చార్జీలు రోజుకు రూ.900, ఫర్నిచర్‌ కుర్చికి ఒక్కరోజుకు రూ.12, సోఫాకు రూ.350, హోర్డింగ్‌లు పెట్టేందుకు మున్సిపాలిటీకి రోజుకు చెల్లించాల్సింది రూ.700, టెంట్‌(షామియానాలు) రూ.2,600, కార్పెట్లు బిగ్‌ సైజ్‌ రూ.500, చిన్నసైజు రూ.400, సైడ్‌వాల్స్‌ రూ.150, వాటర్‌ డ్రమ్స్‌ రోజుకు ఒక్కోదానికి రూ.70, గ్లాసులు రూ.5, రైస్‌ ప్లేట్లు రూ.5, ఐరన్‌ టేబుల్‌ రూ.100 వరకే కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు