ప్రతి పులికీ ఓ లెక్కుంది!

3 Feb, 2018 01:04 IST|Sakshi
గుండంలో కనిపించిన పులి పాదముద్రలు

కారడవుల్లో పులి పాదముద్రల వేట

సేకరణ ఆద్యంతం ఆసక్తి.. ఉత్కంఠ

రాజీవ్‌ టైగర్‌ ఫారెస్టు పరిధిలో 230 పులి పాద ముద్రలు

నల్లమలలో పులుల గణన బృందంతో ‘సాక్షి’

నల్లమల నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి
అప్పుడే తెలతెలవారుతోంది.. దట్టమైన అడవి.. నింగిని తాకుతున్నాయా అన్నట్టుగా ఎల్తైన చెట్లు.. భానుడి లేలేత కిరణాలతో చిగురుటాకులపై మెరిసిపోతున్న మంచు బిందువులు.. ఆకాశంలో రివ్వురివ్వున పక్షులు.. ఎటు చూసినా ప్రకృతి సోయగాలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇంతలో గుండెలు అదిరిపడేట్టుగా.. ‘సార్‌.. పులి అడుగు జాడ. అడుగు ముందుకు వేయకండి..’ ఎఫ్‌ఆర్వో శ్రీదేవి హెచ్చరిక! వెంటనే ఆమె తన భుజాన ఉన్న కిట్‌బ్యాగ్‌ను తీశారు.

మార్కర్, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో పులి అడుగును సేకరించే పనిలో పడిపోయారు. అది సేకరించిన తర్వాత ఇంకా దట్టమైన అడవిలోకి బృందం ప్రయాణం సాగింది. పులుల గణన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ‘సాక్షి’ మన్ననూర్‌ ఎఫ్‌ఆర్వో శ్రీదేవి టీంతో కలసి ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పర్యటించింది. ఈ ప్రయాణ విశేషాలు, పులుల పాదముద్రలను సేకరించే విధానంపై ఆసక్తికర అంశాలు..

పాద ముద్రలు సేకరిస్తారిలా..
మన్ననూర్‌ వెస్ట్‌ బీట్‌లోని ట్రయల్‌ పాత్‌పై బృందం ప్రయాణం సాగింది. ఉదయం 7 గంటలకల్లా అటవీ ప్రాంతంలోని గుండం చేరుకున్నాం. జంతువుల దాహార్తిని తీర్చుతున్న సహజమైన జల స్థావరం ఇది. దీని ఒడ్డునే పులి పాద ముద్రలు కనిపించాయి. స్పష్టంగా కనిపించే పాదాలను సేకరించేందుకు ఒక పద్ధతి, అస్పష్ట పాదముద్రలు సేకరించడానికి మరో పద్ధతి ఉంటుంది. నీటి చెమ్మ ఉండటంతో పులి అడుగు బలంగా పడింది. వెంటనే బృందంలో ఓ సభ్యుడు పరిసరాలను శుభ్రం చేశాడు.

మరో సభ్యురాలు పచ్చి వెదురు కొమ్మను విరుచుకొచ్చి చుట్టలా మార్చి పాద ముద్రల చుట్టూ ఉంచింది. తర్వాత వెంట తెచ్చుకున్న ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పౌడర్‌ను చిన్న బకెట్లో నీళ్లతో కలిపి పాద ముద్రలపై పోశారు. 10 నిమిషాల తర్వాత ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పాదముద్రల అచ్చులతో గట్టిపడింది. దాన్ని తీసి భద్రపరిచారు. ఇలాంటి పాద ముద్రల నమూనాలు రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలో 230 వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పాదముద్రల చిత్రాలను ఆన్‌లైన్‌లో వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు పంపుతామని, అక్కడి నిపుణులు వాటిని విశ్లేషించి అవి ఎన్ని పులుల పాదముద్రలో అంచనా వేస్తారని అమ్రాబాద్‌ రేంజర్‌ ప్రభాకర్‌ తెలిపారు. గుండం వద్ద చిరుత పులుల పాదముద్రలు కూడా చాలానే కన్పించాయి. వామికొండ వైపు వెళ్తుండగా దారి మధ్యలో.. మూషిక జింకలు కనిపించాయి. ఇవి ప్రస్తుతం అంతర్ధాన దశలో ఉన్నాయి. వామికొండ అటవీ ప్రాంతంలో కూడా పులి పాదముద్రలు కన్పించాయి.

పులి దారి.. రహదారి!
పులులు, చిరుత పులులు ఎలుగుబంటి తదితర జంతువుల పాదముద్రలను గుర్తించేందుకు ముందుగా... అవి ఎక్కువగా నడిచే అవకాశం ఉన్న ప్రాంతం మీదుగా ఒక దారిని రూపొందిస్తారు. ఈ దారినే ‘ట్రయల్‌ పాత్‌’అని పిలుస్తారు. ఇది 5 మీటర్ల వెడల్పుతో సుమారు 5 కి.మీ. పొడవు ఉంటుంది. పులిది ఎప్పుడూ రాజ మార్గమే. పొదలు, పుట్టల మాటున దాక్కొని నడవడం దానికి ఇష్టం ఉండదు.

చదునుగా విస్తరించిన బాటపైనే నడుస్తుంది. ఈ ట్రయల్‌ పాత్‌పైనే చాలా అటవీ జంతువుల పాదముద్రలు, వాటి విసర్జితాలు(పెంటికలు) కనిపిస్తాయి. అధికారులు కేవలం పులి, చిరుత పాదముద్రలు, పెంటిక నమూనాలు మాత్రమే సేకరించారు. మిగిలిన జంతువుల గుర్తులను నమోదు చేసుకున్నారు. తెలంగాణ పరిధిలోకి వచ్చే రాజీవ్‌ రిజర్వ్‌ టైగర్‌ ఫారెస్టులో మొత్తం 642 ట్రయల్‌ పాత్‌లు ఏర్పాటు చేశారు.

శాకాహార జంతువులకు  ‘ట్రాన్‌సాక్ట్‌’
శాకాహార జంతువులను లెక్కించేందుకు మరో పద్ధతి ఉంటుంది. ఇందుకు ఏర్పాటు చేసే మార్గాన్ని ‘ట్రాన్‌సాక్ట్‌’అని పిలుస్తారు. 2 కి.మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ప్రతి బీట్‌కు ఒకటి చొప్పున నల్లమలలో మొత్తం 213 ట్రాన్‌సాక్ట్‌లు ఏర్పాటు చేశారు. ట్రాన్‌సాక్ట్‌కు ప్రతి 400 మీటర్లకు ఒక మార్కు చొప్పున విభజన చేశారు. ప్రతి మార్కు పరిధిలో సాధారణ మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లు, పొదలను లెక్క గట్టారు.

మరిన్ని వార్తలు