అంచనాల మేరకే ఆబ్కారీ ఆదాయం

13 Nov, 2014 03:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ప్రధానమైన ఎక్సైజ్‌శాఖ ఈ ఏడాది లక్ష్యానికి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో గత ఏడాది కన్నా 12 శాతం అదనపు ఆదాయం సాధించింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణ పదిజిల్లాల నుంచి వచ్చిన ఆదాయంతో పోల్చితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా అంతే ఆదాయం వస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం గత నెల 20 నుంచి ఈ నెల మొదటి వారం వ రకు పది జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించారు.

లెసైన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో పాటు నెలానెలా లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు. దీంతో ఐదునెలల్లో అంచనాను మించి 11వేల కోట్లకు పైగా ఆదాయం ఎక్సైజ్‌శాఖకు సమకూరే అవకాశం ఉంది.
 
 గతేడాదికన్నా 12 శాతం దాటిన వృద్ధి రేటు
 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయ గణాంకాల ప్రకారం 12 శాతం మేర వృద్ధిరేటు కనిపిస్తోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ. 4,948.11 కోట్లు కాగా, అందుకున్న లక్ష్యం రూ. 5,195 కోట్లు. అంటే ఆరునెలల్లో వృద్ధిరేటు 12 శాతం. అక్టోబర్ నెలకు సంబంధించి లెక్కలు కూడా కలుపుకుంటే ఈ లక్ష్యం మరింత ఎక్కువేనని చెప్పుకోవచ్చు.
 
 ముఖ్యాంశాలు..
 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు 5,612.70 కోట్లు సమకూరాయి.  
 అక్టోబర్ ఒక్కనెలలోనే రూ. 1,016 కోట్లు ఎక్సైజ్‌శాఖ ఆర్జించింది.
 గత ఏడాది సమకూరిన ఆదాయం రూ. 9,911.98 కోట్లు.
 దీనికి 10శాతం అదనంగా ఈ ఏడాది రూ. 10,700 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆశిస్తోంది.
 గత నెలలో ఎక్సైజ్ శాఖకు లెసైన్స్‌ఫీజుల రూపంలో వచ్చిన మొత్తమే రూ. 321.20 కోట్లు.
 ఇక ఎక్సైజ్ డ్యూటీ, ప్రివిలేజ్ టాక్స్, వ్యాట్, ఇతర పన్నుల ద్వారా సుమారు రూ. 695 కోట్లు సమకూరింది.

>
మరిన్ని వార్తలు