భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో విఫలం

8 Jul, 2018 02:21 IST|Sakshi
శనివారం మీడియాతో మాట్లాడుతున్న ఇఫ్తెఖార్‌ గిలానీ

ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తెఖార్‌ గిలానీ

సాక్షి, హైదరాబాద్‌: కశ్మీర్‌లో భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తి వైఫల్యం చెందారని ప్రముఖ పాత్రికేయులు, డీఎన్‌ఏ పత్రిక న్యూఢిల్లీ సంపాదకులు ఇఫ్తెఖార్‌ గిలానీ అన్నారు. ఈ పరిస్థితులపై ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల ఉద్యమకారులు స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కశ్మీర్‌లో మీడియా పరిస్థితి భయంకరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో సీనియర్‌ పాత్రికేయులు షుజాత్‌ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసినానంతరం కశ్మీర్‌లో నెలకొన్న మీడియా పరిస్థితులపై శనివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా (మెఫీ) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. ఆర్మీ, తీవ్రవాదులు, ప్రభు త్వ అనుకూల ముఠాలు, పోలీసులు మీడియాను శత్రువుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. షుజాత్‌ బుఖారీ హత్యపై భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హత్య అనంతరం మీడియాపై బెదిరింపులు తీవ్రస్థాయికి చేరాయన్నారు. పాత్రికేయులు ధైర్యంగా, నిర్భయంగా వార్తలు రాస్తూ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేని పత్రికలకు భారత ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వటం లేదని, ఈ ప్రస్తుత పరిణామాలకు జాతీయ మీడియా కూడా బాధ్యత వహించాలన్నారు. జాతీయ మీడియా నెగటివ్‌ వార్తలు ప్రచారం చేస్తోందని తెలిపారు. కశ్మీర్‌ అందాలు, భక్తి భావాల గురించి చెప్పడం మరచి హింస గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్రం తమ విధానం మార్చుకొని ప్రేమపూర్వకంగా నడవాలన్నారు. కశ్మీర్‌లో జరుగు తున్న మీడియాపై దాడుల విషయం ప్రభుత్వానికి, గవర్నర్‌కు చెప్పిన ప్రయోజనం లేదన్నారు. వార్తలు రాసే పరిస్థితులు కశ్మీర్‌లో లేవన్నారు.

ఇక నార్త్‌ కశ్మీర్‌లో వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి అసలే లేదన్నారు. కశ్మీర్‌లో 13 మంది జర్నలిస్టులు చనిపోతే విచారణలో పురోగతి లేదన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జర్నలిస్టులు చేపట్టే కార్యక్రమాలకు అన్ని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు అండగా నిలబడాలని తెలిపారు. జర్నలిస్టులపై అక్కడ జరిగే దాడుల గురించి మానవ హక్కుల సంఘాలు కానీ ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించటంలేదన్నారు.

ఐజేయూ అధ్యక్షులు ఎస్‌.ఎన్‌.సిన్హా మాట్లాడుతూ కశ్మీర్‌లో జరిగే పాత్రికేయుల హత్యలపై జాతీయ మీడియా దృష్టి సారించాలని, కశ్మీర్‌ పరిణామాలను వాస్తవిక దృక్పథంతో చూడటం లేదని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యతిరేక ప్రచారం చేయడం దారుణమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్టులు కలసి పోరాడినప్పుడే ఇలాంటి ఘటనలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల గొంతు నొక్కడమం టే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని అన్నారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బృందం కశ్మీర్‌ను సందర్శించి నివేదికను తయారు చేస్తే దానిని కేంద్రానికి అందజేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు