రైతుకు కన్నీళ్లే!

18 Mar, 2019 16:52 IST|Sakshi
తాడూరు శివారులో పశువులకు మేతగా మారిన వరి పంట

నీటిఎద్దడితో  ఎండుతున్న పంటలు 

పశువులకు  మేతగా వదిలేస్తున్న వైనం  

సాక్షి, తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కేఎల్‌ఐ కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు పొలాలను సిద్ధం చేసుకొని వరిని నాటుకున్నారు. కానీ సాగుచేసుకున్న వరి పంటలు తగినంత నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడడం, పంటలు ఎండిపోవడంతో గత్యంతరం లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.

మండల కేంద్రంలో రామస్వామి అనే రైతు కేఎల్‌ఐ నీటితో నిండిన కొత్త చెరువు కింద నీరు వస్తుందని ఆశతో రూ.వేలల్లో వెచ్చించి వరి పంట సాగుచేశాడు. కానీ కాల్వల ద్వారా నీరు రాకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది.

దీంతో సాగు చేసిన వరి పంటలు బీటలు వారి ఎండిపోయింది. రెండు తడుల వరకు నీరు ఉంటే కాస్త పంట పండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఆకునెల్లికుదురు, గుంతకోడూరు, అల్లాపూర్‌ గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో పశువులను మేత కోసం వదిలారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎండిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 
 

మరిన్ని వార్తలు