కష్టకాలం

3 Nov, 2014 02:53 IST|Sakshi

 సాక్షి, ఖమ్మం: నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఆశతో ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతన్నకు ఆ తర్వాత నిరాశేమిగిలింది. విత్తునాటడానికే చినుకులు రాలకపోవడంతో అప్పుడుప్పుడు కురిసే జల్లులతోనే 3,31,494 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి.

ఇప్పటికే ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, మధిర, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. విద్యుత్ కోతలతో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, టేకులపల్లి, గుండాల, బూర్గంపాడు, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ తదితర మండలాల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి చేతికి అందే దశలో ఎండిపోతోంది. ఆయా మండలాల్లో పత్తి పంట కూడా వాడిపోవడంతో దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగు చేసిన మిరప తోటలు ఆశాజనకంగా లేవు. వర్షాభావంతో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి.

 అడుగంటిన భూగర్భ జలాలు
 తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్‌లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు ఎదురవుతాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర (వీఎంల)లో  గత నెలలో అత్యధికంగా 6.33 మీటర్లకు నీటిమట్టం పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది.

 దళారీ చేతిలో రైతు దగా
 అరకొరగా చేతికి అందిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత కుంగదీస్తోంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు దక్కపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటి వరకు కేవలం ఖమ్మంలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే తెరిచారు. ఈ కేంద్రంలోనూ వ్యాపారుల దందానే కొనుసాగుతండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర రూ.4,050 అయితే దళారులు రూ.3వేల నుంచి రూ. 3,500 వరకే పెడుతున్నారు.

 రుణమాఫీకి ఎదురుచూపులు..
 ఈ ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,400 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4.81 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారు. రూ.724 కోట్లు రెన్యూవల్స్ చూపించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,700 కోట్లు రుణమాఫీ కావాలి. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ కింద జిల్లాకు రూ.427.85 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది.

వీటిలో రూ.285 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. నూతన రుణాలు, రుణమాఫీ అంటూ కాగితాల్లోనే ప్రభుత్వం అంకెల గారిడి చేసింది.  కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

 బలవన్మరణం..
 జిల్లాలో 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఏ ఒక్కటీ నమోదుకాకపోవడం గమనార్హం. మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన మొగిలి నాగేశ్వరరావు (30) పత్తి సాగుతో అప్పులపాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పినపాక నియోజకవర్గంలో ఈ సీజన్‌లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

అశ్వాపురం మండంలోని అమెర్ధ పంచాయతీ చండ్రలబోడు గ్రామానికి చెందిన ఎనిక తిరుపతి(40), గుండాల మండలం దామర గూడెం వాసి పాయం పాపయ్య(30), నడిమిగూడెంకు చెందిన పాయం రాంబాబు(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామ రైతు తమ్మినేని వెంకటేశ్వరరావు (40), తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం శివారు అజ్మీరాతండాకు చెందిన భూక్యా సామ్యా (35), ఏన్కూరు మండలం రాయమాధారానికి చెందిన జబ్బ శ్రీనివాసరావు (30), జూలూరుపాడు మండలం భీమ్లాతండాకు చెందిన బాదావత్ వెంకట్రామ్(45), పాల్వంచ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తాటి శ్రీను(39) బలవన్మరణానికి పాల్పడ్డారు.

 వర్షాభావం
 వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, దమ్మపేట, ముల్కలపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, గుండాల, చర్ల, వేలేరుపాడు, కొణిజర్ల మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు