వేగంగా ఎదుగుతున్న విత్తన పరిశ్రమ 

27 Jun, 2019 03:05 IST|Sakshi
విత్తన సదస్సులో పాల్గొన్న కైలాష్‌ చౌదరి, నిరంజన్‌రెడ్డి, పార్థసారథి, మహమూద్‌ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు, కూరగాయలను పరిశీలిస్తున్న అంతర్జాతీయ మహిళా ప్రతినిధి

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి స్పష్టీకరణ

దేశంలో విత్తన ఉత్పత్తిలో తెలంగాణ టాప్‌లో ఉందని వెల్లడి

ఘనంగా ప్రారంభమైన ఇస్టా కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే భారతదేశంలో విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్‌ చౌదరి అన్నారు. దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే, అందులో తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయన్నారు. తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధికి బాటలు వేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో బుధవారం అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రైతాంగ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమన్నారు. ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారత్‌లో జరగడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే పత్తి విత్తనోత్పత్తిలో భారత్‌ది అగ్రస్థానం కాగా... వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, కూరగాయల్లో మేలైన విత్తనాల ఉత్పత్తి జరుగుతుందన్నారు. పర్యావరణ మార్పులు, తరుగుతున్న సహజ వనరుల నేపథ్యం లో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కైలాష్‌ చౌదరి అభిప్రాయపడ్డారు.  

తెలంగాణది పెద్దన్న పాత్ర: నిరంజన్‌రెడ్డి 
భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, సీఎం కేసీఆర్‌ కృషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇస్టా సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహదపడుతుందన్నారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తనరంగ సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. నాణ్యమైన విత్తనమే వ్యవసాయాభివృద్ధికి మూలమన్నారు. విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. రైతులకు విత్తనోత్పత్తిలో సాయంగా ఉండే పాలసీలను తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

నాణ్యతకు ఆదరణ: మహమూద్‌ అలీ 
నాణ్యమైన ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అదే కారణమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సుకు గౌరవ అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇస్టా సదస్సు మూలంగా విత్తన పరీక్షా ప్రమాణాలు మన రైతులకు, నిపుణులకు తెలుస్తాయన్నారు. దానికి అనుగుణంగా పంటలు పండించి విత్తనాలను రూపొందించడం మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.  

ప్రమాణాల పెరుగుదలకు దోహదం..
వివిధ దేశాల విత్తన అవసరాలు, ప్రమాణాలు పరస్పరం తెలుసుకునేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన మొలక శాతం, నాణ్యత పరీక్షలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై జరిగిన పరిశోధనా ఫలితాలు అందరూ తెలుసుకునేందుకు ఇది అవకాశం అని, తెలంగాణ విత్తన బ్రాండ్‌ను అంతర్జాతీయంగా మార్కెట్‌ చేయడానికి దీంతో అవకాశాలు మెరుగవుతాయన్నారు.  

‘ఇస్టా’సదస్సుకు 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారతీయ, తెలంగాణ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎగ్జిబిషన్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. సదస్సుకు ఇస్టా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ క్రెగ్‌ మెక్‌గ్రిల్, జాతీయ విత్తన సంయుక్త కార్యదర్శి అశ్వనీకుమార్, జాతీయ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్, వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు వందన సమర్పణతో తొలిరోజు సదస్సు ముగిసింది. గురువారం సదస్సులో కీలకమైన విత్తనోత్పత్తి రైతుల సమావేశం జరగనుంది.  

నేడు విత్తన రైతుల సదస్సు
అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండోరోజు గురువారం విత్తన రైతు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 1,500 మంది విత్తనోత్పత్తి రైతులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్‌రెడ్డిలు హాజరుకానున్నట్లు తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్, ఇస్టా సదస్సు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కేశవులు తెలిపారు. విత్తన సదస్సు సందర్భంగా విత్తన సాగు చేపడుతున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, వివిధ దేశాలలో విత్తన అవసరాల గుర్తింపు, ఏయే దేశాలకు ఏ విత్తనాలు ఎగుమతి చేయగలమనే అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా ప్రారంభోపన్యాసం చేయనున్నారు.  

మరిన్ని వార్తలు