తొలి విడత ప్రచారం షురూ!

29 Apr, 2019 02:32 IST|Sakshi

ముగిసిన ‘పరిషత్‌’ ఎన్నికల రెండోదశ నామినేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణతో రాజకీయ పార్టీలు, స్వతంత్రుల గుర్తుల వారీగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను రిటర్నింగ్‌ అధికారులు ఖరారు చేసి, అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. వచ్చేనెల 6న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలుండడంతో రాజకీయ పార్టీల గుర్తులతో బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌నకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే వీటి ముద్రణ పూర్తిచేసి, పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ఈ విడత ఎన్నికల ప్రచారం కూడా ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. 

నేడు రెండో విడత నామినేషన్ల పరిశీలన
రెండోదశ పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్లను పరిశీలించి, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా సిద్ధం చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా అప్పీలు చేసుకోవాలి. మే1న సాయంత్రం 5లో గా వాటిని పరిష్కరిస్తారు. 2న నామినేషన్ల ఉపసం హరణ గడువు ముగిశాక, అదేరోజుసాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 10న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం వరకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు 4, 652, 180 జెడ్పీటీసీ స్థానాలకు 660 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశకు నామినేషన్ల ప్రక్రియ ఆఖరు రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

మరిన్ని వార్తలు