ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌!

3 Dec, 2017 02:19 IST|Sakshi

     త్వరలో నిబంధనల్లో మార్పులు 

     పరిమిత ర్యాంకు నిబంధనకు స్వస్తి 

     రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.310 కోట్ల అదనపు భారం 

సాక్షి, హైదరాబాద్‌: బీసీ విద్యార్థులకు శుభవార్త. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సర్కారు ఊరట ఇవ్వబోతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిబంధనల్లో మార్పులు చేపట్టనున్నట్లు తెలిసింది. కాలేజీ ఫీజును పూర్తిస్థాయిలో పొందాలంటే సదరు విద్యార్థికి సెట్‌(కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో పదివేలలోపు ర్యాంకు రావాల్సి ఉంది. పదివేల కంటే పైబడి ర్యాంకు వస్తే కేవలం రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా మొత్తాన్ని విద్యార్థి భరించాల్సి వచ్చేది.

ఈ నిబంధనపై బీసీ, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే ఈ నిబంధన పెట్టినట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బీసీ ‘ఈ’లో ఉన్న మైనార్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజులిస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీల్లోని ఇతర బీసీ విద్యార్థులపై ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

భారం రూ.310 కోట్లు... 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఈ ఏడాది 13.06 లక్షల దరఖాస్తులు రాగా, అందులో బీసీ విద్యార్థుల దరఖాస్తులు 7.22 లక్షలు. ఇంజనీరింగ్‌ కోర్సుకు సంబంధించి పదివేల ర్యాంకు దాటిన విద్యార్థులకు ఫీజు కింద రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజు సగటున 45 వేలకుపైగా ఉంది. పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తేస్తే గరిష్టంగా రూ.310 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏటా రూ.2,810 కోట్ల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిబంధనలపై సమీక్ష నిర్వహిస్తున్న సర్కారు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా