మురుగు శుద్ధికి ఇక రోబోటిక్‌ టెక్నాలజీ

5 Jun, 2018 11:10 IST|Sakshi
మురుగునీటి పైప్‌లైన్లను శుద్ధిచేసే అధునాతన రోబోటిక్‌ సాంకేతికత యంత్రాలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ 

మున్సిపాలిటీల్లో బహిరంగ మలవిసర్జన రహితంతో పాటు మెరుగైన పారిశుద్ద్యమే లక్ష్యం 

జలమండలిలో రోబోటిక్‌ మురుగు శుద్ధి రోబోలను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ 

ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి నాలాపై మినీ ఎస్టీపీలు 

100 నివాసాలున్న అపార్ట్‌మెంట్లకు  మినీ ఎస్టీపీ తప్పనిసరి 

సాక్షి,సిటీబ్యూరో :  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌మిషన్‌లో భాగంగా ప్రకటించిన బహిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్‌)తోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీలను మెరుగైన పారిశుద్ధ్యంతో ఓడీఎఫ్‌ ప్లస్‌ నగరాలుగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం  ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మురుగునీటి పైప్‌లైన్లు, మ్యాన్‌హోళ్లను శుద్ధిచేసే అధునాతన రోబోటిక్‌ సాంకేతికత పనితీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీవరేజి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే రోబోటిక్‌ సాంకేతికను అమలు చేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జలమండలి చేపట్టే నూతన ప్రాజెక్టు వ్యయంలో 0.25 శాతం సెస్‌ వసూలు చేసి  కార్మికుల సంక్షేమం, నూతన సాంకేతిక ఆవిష్కరణల అమలు కోసం వినియోగిస్తామని ప్రకటించారు.

ఇప్పటికే కార్మికులు నేరుగా మురుగునీటి పైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా జలమండలి  73 మినీ జెట్టింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు మరో 70 యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.  మొత్తం 143 జెట్టింగ్‌ యంత్రాలకు తోడుగా అవసరమయితే మరిన్ని యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.  ఇటీవల ఉప్పల్‌లో ఓ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక  సీఐపీపీ సాంకేతికతో రోడ్డును తవ్వకుండానే ఎన్టీఆర్‌ మార్గ్‌లో శిథిలమైన పైపులైనుకు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో మురుగు,మంచినీటి పైపులైన్ల జాడ తెలిపేందుకు జలమండలి అధికారులు జీఐఎస్‌ మ్యాపులు సిద్ధంచేయాలని ఆదేశించారు. 

నగరంలో వికేంద్రీకృత మురుగుశుద్ధికేంద్రాలు.. 
గ్రేటర్‌లో ఎస్టీపీల వ్యవస్థను వికేంద్రీకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం మూసీ నదిపై ఉన్న ఎస్టీపీలతో పాటు నాలాలపై ఎక్కడికక్కడ మినీ ఎస్టీపీలు నిర్మించనున్నట్లు తెలిపారు. ముందుగా  3.2 కిమీ పొడవు ఉన్న కూకట్‌పల్లి నాలాపై ప్రయోగాత్మకంగా మినీ ఎస్టీపీలు నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలోని చెరువులను సంపూర్ణ ప్రక్షాళన చేసేందుకు డ్రైనేజీ నీరు చెరువుల్లో చేరకుండా చూస్తామన్నారు. నగరంలో  100 ఫ్లాట్ల కంటే అధికంగా ఉన్న అపార్ట్‌మెంట్లలో తప్పనిసరిగా మినీ ఎస్టీపీలు నిర్మించుకోవాలని సూచించారు.   

జలమండలి ఎండీ దానకిషోర్‌కు అభినందనలు..  
జలమండలి ఎండీగా దానకిషోర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మక సంస్కరణలు, ఆవిష్కరణలు తీసుకువచ్చారని అభినందించారు. గ్రాండ్‌ పేరెంట్‌ అండ్‌ గ్రాండ్‌ చిల్డ్రన్‌ వినూత్న కార్యక్రమంతో జలంజీవం, ఇంకుడుగుంతలపై చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం విశేషమన్నారు.నూతన సాంకేతికత వినియోగంలో జలమండలి అం దరికంటే ముందుందని ప్రశంసించారు. ము న్సిపల్‌ పరిపాలన శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఈడీ సత్యనారాయణ,డైరెక్టర్లు అజ్మీ రాకృష్ణ,విజయ్‌కుమార్‌రెడ్డి,రవి,శ్రీధర్‌బాబు,సత్యసూర్యనారాయణ,సఫాయి కర్మచారి ఆందోళన్‌ అధ్యక్షుడు బెజవాడ విల్సన్‌ తదితరులున్నారు. 

నూతన రోబోటిక్‌ టెక్నాలజీ వివరాలు 

రోబోటిక్‌ 360 డిగ్రీస్‌ కెమెరా : 
బెంగుళూరుకు చెందిన సానిటర్‌ సంస్థ రూపొందించిన ఈ కెమెరాను మ్యాన్‌హోల్‌ ద్వారా సెవరెజీ పైప్‌లైనులోకి ప్రవేశపెడితే.. మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న వస్తువులను గుర్తిస్తుంది. ఆపరేటర్‌ చేతిలోని రిమోట్‌ ద్వారా కెమెరాను పైపులో 360 డిగ్రీస్‌ తిప్పి అందులో అడ్డుగా ఉన్న  వాటిని గుర్తించవచ్చు. కెమెరాకు దాదాపు 30 మీటర్ల పొడవున్న కేబుల్‌ ఉంటుంది. ఇది డ్రైనేజీ లైనులో 30మీటర్ల వరకు వెళుతుంది. కెమెరా పైపులో వెళుతుంటే పైన ఉన్న మానిటర్‌లో మనకు కెమెరా చిత్రికరించే వీడియోలను చూడవచ్చు.  

సెవర్‌ క్రాక్‌ రోబో 
సానిటర్‌ సంస్థ రూపొందించింన మినీ రోబోనే సెవర్‌ క్రాక్‌. దాదాపు 12 కిలోల బరువుండే ఈ రోబో సెవరెజీ పైపులైను అడ్డుగా ఉన్న వస్తువులను తొలగిస్తుంది. ముందుగా ఈ యంత్రాలను జెట్టింగ్‌ యంత్రాలకు అనుసంధానం చేస్తారు. గుండ్రంగా ఉన్న ఈ యంత్రానికి మూడు వైపులా ఆరు వరుసల్లో చిన్న చక్రాలు ఉంటాయి. వీటి సాయంతో యంత్రం సులువుగా ముందుకు సాగుతుంది. ఒకవేళ వాహనం బోల్తా పడినప్పటికీ మరో వైపు ఉన్న చక్రాల ద్వారా ముందుకు కదులుతుంది. అలాగే వీటికే ముందు భాగంలో బలమైన బ్లేడులు ఉండడంతో అడ్డుగా ఉన్న వస్తువును ముక్కలుగా కట్‌చేస్తుంది.  రాళ్లు ,మట్టి, ప్లాస్టిక్‌ తదితర ఘన వ్యర్థాలు,ధృడమైన పదార్థాలను సైతం సులువుగా కట్‌చేస్తుంది.  దీంతో మురుగు  ప్రవాహాం సాఫీగా> సాగుతుంది. ఎప్పుడైనా మురుగు ప్రవాహానికి ఏ దైనా అడ్డుగా ఉంటే వెంటనే వీటిని రంగంలోకి దింపి ప్రవాహాన్ని సాఫీగా వెళ్లేలా చూడవచ్చు. 

గ్యాస్‌ డిటెక్టర్‌ 

తాగునీరు,మురుగునీటి పైపులైన్లలో ఉత్పన్నమయ్యే విష వాయువులను గుర్తించడానికి ఈ గ్యాస్‌ డిటెక్టర్లను వినియోగించవచ్చు.దీనికి ఉ న్న అబ్జర్వర్‌ను  మ్యాన్‌హోళ్ల గుండా పైపులైన్‌ లోనికి పంపితే విషవాయువుల ఉనికిని గుర్తిస్తుంది. ఇక దీనికున్న డిటెక్టర్‌ ద్వారా  పైప్‌లైన్‌లో వెలువడే మిథేన్,  కార్బన్‌ డయాక్సైడ్, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ తదితర విష  వాయువులను గుర్తిస్తుంది. దీంతో పారిశుద్ద్య పనులు చేపట్టే కార్మికుల జీవితాలకు భద్రత చేకూరుతుంది. 


 

మరిన్ని వార్తలు