ఆశలన్నీ గోదారిపైనే!

27 Jun, 2015 03:07 IST|Sakshi

♦ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు..
♦ జూలై 1న బాబ్లీ గేట్ల ఎత్తివేతతో ఎస్సారెస్పీలోకి చేరే అవకాశం
♦ {తిసభ్య కమిటీలో తెలంగాణకు చోటుపై 6న సుప్రీంలో విచారణ

 
 సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1వ తేదీన తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బాబ్లీ గేట్లు మూసి ఉంచే గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. దీంతో అదేరోజు అర్ధరాత్రి గేట్లు తెరుస్తారు. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో స్వల్పంగా ప్రవాహం ఉంది. దీంతో ఆ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లోని ఏడు లక్షల ఎకరాలకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు మూసేసిన మహారాష్ట్ర.. వచ్చే నెల 1న తిరిగి తెరవనుంది.

 6న సుప్రీంలో విచారణ..
 సుప్రీంకోర్టులో బాబ్లీ కేసు వచ్చే నెల 6న విచారణకు రానుంది. బాబ్లీ కేసును పరిష్కరించిన సందర్భంగా ఆ ప్రాజెక్టు నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఒక త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఇందులో కేంద్ర జల సంఘం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల తరఫున ఒక్కో ప్రతినిధి ఉంటారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులిచ్చిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 6న చేపడతామని పేర్కొంది. దీనిపై ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణను చేర్చాలని కోరడంతోపాటు ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని ఏపీని తొలగించాలని నివేదించింది.

మరిన్ని వార్తలు