రిపేర్‌ పనులు.. నెలపాటు గోదావరి రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జి మూసివేత 

25 Sep, 2023 04:42 IST|Sakshi

ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 26 వరకు రాకపోకలు నిలిపివేత

రూ.2.10 కోట్లతో బ్రిడ్జికి మరమ్మతులు

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలత వెల్లడి  

రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు: గోదావరి నదిపై రాజమహేంద్రవరం–కొవ్వూరు పట్టణాల మధ్య ఉన్న రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేయనున్నారు. 1974 నవంబర్‌ 20న ఈ వంతెనను అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ప్రారంభించారు. 49 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ వంతెన పూర్తిగా పాడైంది. సెంట్రల్‌ క్యారేజ్‌ వే, వయాడక్ట్‌ భాగం, అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 26వ తేదీ వరకూ ఈ బ్రిడ్జిని మూసివేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆదివారం ప్రకటించారు.

మరమ్మతు పనులకు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వయాడక్ట్‌ భాగం, అప్రోచ్‌లు సహా బీటీ క్యారేజ్‌వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్‌ గ్రిడ్‌ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లు వెమరమ్మతుల స్తున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే మిల్లింగ్‌ మెషీన్‌తో బీటీ సర్ఫేస్‌ తొలగింపు తదితర పనులు చేపట్టారు.

ఈ బ్రిడ్జి మీదుగా తిరిగే వాహనాలను గామన్‌ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రవాణా, ఆర్టీసీ అధికారులను కోరామని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు