‘రైతులను ఆదుకోవాలి’

28 Feb, 2019 04:19 IST|Sakshi

హైదరాబాద్‌: పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ఆర్మూరు రైతులను నిర్బంధించడం సరికాదని అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

పసుపు, ఎర్రజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎర్రజొన్నలకు రూ.3,500, పసుపు క్వింటాల్‌కు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. పత్తి, మిర్చి, కంది పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 23న రాష్ట్రవాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులతో సమావేశం జరిపి వారు కోరిన న్యాయమైన ధరలకే పంట కొనుగొలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు