టీచర్లకు పరీక్ష!

11 Mar, 2019 01:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొనే టీచర్లకు మరో క్లిష్ట పరిస్థితి ఎదురుకానుంది. జనవరి 25న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులను ఏ అర్ధరాత్రికో పూర్తిచేసుకుని మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఉరుకులు, పరుగులతో పాఠశాలలకు చేరుకోడానికి నానా తిప్పలు పడిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితే టీచర్లకు మళ్లీ తలెత్తనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 11న ఎన్నికల విధులు నిర్వహించాలి. మరుసటి రోజు ఉదయం 7.45 వరకే టీచర్లు స్కూళ్లల్లో విధిగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్‌ 12వ తేదీ పాఠశాలల లాస్ట్‌ వర్కింగ్‌ డే కాబట్టి. ఆ రోజు స్కూలుకు వెళ్లకపోతే వేసవి సెలవులకు సంబంధించిన వేతనం చెల్లించేది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్‌ ఒకటి తర్వాతే. అదీ జూన్‌ ఒకటిన స్కూలుకు హాజరైతేనే. ఇటు ఏప్రిల్‌ 12వ తేదీన స్కూలుకు వెళ్లక, అటు జూన్‌ ఒకటిన పాఠశాలకు గైర్హాజరయ్యే అనివార్య పరిస్థితులు ఏర్పడి టీచర్లకు తీవ్ర నష్టం జరగనుంది. అలాంటి టీచర్లకు వేసవి సెలవులకు సంబంధించిన జీతం చెల్లించరు. లీవ్‌ మంజూరు చేయించుకుంటేనే వేతనం చెల్లిస్తారు. సెలవులు నిల్వలేని టీచర్లకు 49 రోజులు వేతనంలో కోతే! అయితే, ఎంపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లు ఏప్రిల్‌ 12న గైర్హాజరైతే దాన్ని జర్నీ పీరియడ్‌గా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే మాత్రం ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకోవచ్చు.   

మరిన్ని వార్తలు