కేసీఆర్‌ నీ టైం అయిపోయింది: ఆర్మూర్‌ సభలో అమిత్‌ షా

24 Nov, 2023 15:59 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌:  పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ సర్కార్‌ నెరవేర్చలేదు. పదేళ్లుగా తెలంగాణను నాశనం చేసింది. 2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని కేసీఆర్‌ మాటిచ్చి తప్పారు. కానీ, బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను కేసీఆర్‌ ప్రభుత్వం కబ్జా చేసింది. పేపర్‌ లీకేజ్‌లతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. టేబుల్‌పైన ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే.. వాళ్లను మంత్రి వర్గంలో కేసీఆర్‌ చేర్చుకునేవారు. కేసీఆర్‌ నీ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది.. 

..అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది.  కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తెలంగాణ కోసం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం. అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతిలో ఉంది. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా?..  

..మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్ కట్టిస్తాం. ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెస్తాం. జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం అని షా ప్రకటించారు. 

ఆర్మూర్‌ సభ అనంతరం రాజేంద్ర నగర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు అమిత్‌ షా. సాయంత్రం అంబర్‌పేటలో రోడ్‌ షర్లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు