హైదరాబాద్‌లో కజికిస్తాన్‌ కాన్సులేట్‌

13 Dec, 2019 01:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కజికిస్తాన్‌ దేశానికి సంబంధించిన కాన్సులేట్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి యెర్లాన్‌ అలింబాయేవ్‌ వెల్లడించారు. ఎంఏకే ప్రాజెక్ట్స్‌ ఎండీ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌ను గౌరవ కాన్సూల్‌ జనరల్‌గా నియమించనున్నట్లు తెలిపారు. గురువారం నగరాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన గవర్నర్‌ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రంతో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు గల అవకాశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

తొలుత నగరంలోని పార్క్‌ హోటల్‌లో విలేకరులతో యెర్లాన్‌ మాట్లాడుతూ.. కజికిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి తెలంగాణ, ఏపీలకు అపార అవకాశాలున్నాయన్నారు. గనులు, ఆయిల్‌ రిఫైనరీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యంత్రాల ఉత్పత్తిలో భారత్‌ నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రాంకీ గ్రూప్‌ చైర్మన్‌ అయోధ్య రామిరెడ్డి, రెడ్డీ ల్యాబ్‌ సీఈవో జీవీ ప్రసాద్, సినీ నిర్మాత అల్లు అరవింద్, హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డిలతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అలీఖాన్, కజక్‌ ఇన్వెస్ట్‌ కంపెనీ ప్రాంతీయ డైరెక్టర్‌ అయిగుల్‌ సురాలినా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు