కేరళకు విరాళాల వెల్లువ

22 Aug, 2018 01:30 IST|Sakshi

మేము సైతం అని ముందుకొస్తున్న ఉద్యోగులు

ఒక రోజు వేతనాన్ని అందించిన పలు విభాగాల ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఉద్యోగులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు.

విరాళాలు అందించిన వారు..
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక రోజు బేసిక్‌పేను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్‌ ఎస్‌కే జోషిని కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి రూ.48 కోట్లకు సమ్మతి పత్రాన్ని అందించారు.  
 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు.  
 రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఉద్యోగులంతా ఒక రోజు వేతనానికి సంబంధించి రూ.9 కోట్ల చెక్కును మంత్రి జగదీశ్‌రెడ్డికి అందించారు.  
♦  రాజ్‌భవన్‌ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే గవర్నర్‌ నరసింహన్‌ సతీమణి విమలా నరసింహన్‌ రూ.10 వేలు విరాళాన్ని అందించారు.  
రాష్ట్రంలోని తహసీలార్లు, వీఆర్వోలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌ సీఎస్‌ జోషికి అంగీకార పత్రం అందించారు.  
♦  రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం తరఫున రూ.4 కోట్లు అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.  
 తెలంగాణ మున్సిపల్‌ కమిషనర్‌ అసోసియేషన్‌ తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు మంత్రి కేటీఆర్‌కు అనుమతి పత్రాన్ని అందజేశారు.  
 కేరళకు పంపే నిత్యావసర వస్తువులు, సరుకులను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే 60 టన్నుల వస్తు సామగ్రిని మంగళవారం కేరళకు పంపింది. 

మరిన్ని వార్తలు