తండాలిక పంచాయతీలు..

25 Jun, 2014 04:17 IST|Sakshi
తండాలిక పంచాయతీలు..

- జిల్లాలో 1000కి పైగా తండాలకు గ్రామ పంచాయతీ హోదా
- 1000 జనాభా పరిగణనలోకి తీసుకుంటే 1214 తండాలకు..
- రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారుల నివేదిక
- త్వరలోనే వెలువడనున్న ఉత్తర్వులు

ఖమ్మం కలెక్టరేట్ : తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలనే లంబాడీ గిరిజనుల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీల వివరాలతో కూడిన నివేదికలుఅందజేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక పంచాయతీరాజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల వివరాలు సేకరించారు.

వాటి భౌగోళిక స్వరూపం ఆధారంగా 500, 750, 1000 జనాభా గల లంబాడీ, ట్రైబల్ తండాలు, గిరిజన తండాలను వేర్వేరుగా గుర్తించారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండాలను పంచాయతీలుగా మార్చుతానని హామీ ఇచ్చి, వాటి పరిస్థితులపై కమిటీ వేసి నివేదికలు సైతం తయారు చేయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పక్కనపెట్టాయి. ఇప్పుడు ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాలిస్తే జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య పెరగనుంది.

ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 758 పంచాయతీలు ఉండగా అదనంగా మరో 1214 పంచాయతీలు (1000 జనాభా పరిగణనలోకి తీసుకుంటే) ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం డివిజన్‌లో 629, ఖమ్మం డివిజన్‌లో 128, భద్రాచలం డివిజన్‌లో 457 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చేందుకు అర్హత ఉన్నవిగా గుర్తించారు. అయితే, పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ అమలయితే జిల్లాలోని గ్రామపంచాయతీల సంఖ్య తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న 758 పంచాయతీల నుంచి 136 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళితే.. జిల్లాలో 622 పంచాయతీలు ఉంటాయి.
 
ప్రభుత్వానికి నివేదికలు..

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం జనాభా ప్రాదిపదికన తండాలను గుర్తించింది. ప్రభుత్వం సూచించిన విధంగా  500, 750, 1000 జనాభా గల తండాల వివరాలను ప్రత్యేక ఫార్మాట్‌లో జిల్లా పంచాయతీ అధికారులు మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించారు. అయితే ఎంత జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తారనే దానిపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవటంతో మూడు ఫార్మాట్‌లలో నివేదికలు పంపించారు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంతో జిల్లాలో మరికొన్ని తండాలు పంచాయతీలుగా మారనున్నాయి.

ఇక తండాలకు కొత్త శోభ...
రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు తండాలను పంచాయతీలుగా గుర్తిస్తే ఆ తండాల అభివృద్ధి వేగవంతం కానుంది. ఇప్పటివరకు పంచాయతీల  పరిధిలో ఉన్న తండాలు గ్రామాలకు దూరంగా ఉండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యం లేక తండా వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే తమ జీవితాలలో కొంతైనా వెలుగులు నిండుతాయని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు