ఢిల్లీకి చేరిన కూటమి చర్చలు

12 Nov, 2018 10:06 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ :నామినేషన్ల పర్వం ప్రారంభమైనా మహాకూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కిరాకపోవడంతో కూటమి చర్చలు ఢిల్లీకి చేరాయి. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలు హస్తిన బాట పట్టారు. సీపీఐ తమకు కనీసం నాలుగు స్ధానాలైనా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ జనసమితి, సీపీఐలకు కేటాయించే స్ధానాలపైనా పూర్తి స్పష్టత కొరవడింది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు, పార్టీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీపీసీసీ చీఫ్‌ అధిష్టానం పెద్దలతో తుది కసరత్తు చేపట్టనున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతాయని, కూటమి మనుగడపై సందేహాలు అవసరం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి చేతిలో టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని, కూటమి సారథ్యంలోనే డిసెంబర్‌ 12న కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ నేడు జరగనుండటంతో ఈ రోజు సాయంత్రం లేదా మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా విడుదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు