గురుకుల విద్యార్థులు భేష్: సీఎం

17 Sep, 2016 02:33 IST|Sakshi
గురుకుల విద్యార్థులు భేష్: సీఎం

* మెడిసిన్‌లో 40, బీడీఎస్‌లో 20 సీట్లు సాధిస్తుండటం అభినందనీయం
* ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఫలితాల స్ఫూర్తితోనే మైనారిటీ గురుకులాలు
* ప్రతిభావంతులైన విద్యార్థులకు పారితోషికాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మెడిసిన్‌లో 40 సీట్లు, బీడీఎస్‌లో 20 సీట్లు సాధించేలా ర్యాంకులు పొందడంతోపాటు ఇతర పోటీ పరీక్షల్లో సత్తా చాటడం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారని పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ క్రిస్టిల్ (ఏబీసీ) ద్వారా 2015-16 సంవత్సరానికి 110 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎంసెట్‌లో శిక్షణ ఇప్పించగా, వారిలో మెజారిటీ విద్యార్థులకు మెడిసిన్, బీడీఎస్‌లలో సీట్లు వచ్చే స్థాయిలో ర్యాంకులు వచ్చాయి.

సొసైటీకి చెందిన విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో 25 మంది, టీఐఎస్‌ఎస్‌లో ఆరుగురు, అజీం ప్రేమ్‌జీ సంస్థలో 11 మంది, ఐఐటీల్లో 45 మంది, నిట్‌లలో ఐదుగురు, సీఏ కోర్సుల్లో ఐదుగురు ప్రవేశాలు పొందారు. ఎస్టీ విద్యార్థులు 9 మంది మెడిసిన్‌లో, నలుగురు బీడీఎస్‌లలో, 50 మంది ఐఐటీ, నిట్ వంటి సంస్థల్లో ప్రవేశం పొందారు. ఈ ఫలితాలపై కేసీఆర్ స్పందిస్తూ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాత మైనారిటీలకు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్‌కుమార్‌కు సీఎం ఫోన్ చేసి అభినందించారు. గురుకుల విద్యార్థుల చదువు పట్ల సీఎం చూపిస్తున్న శ్రద్ధ కారణంగానే ఈ ఫలితాలని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
 
ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సొసైటీ వైస్ చైర్మన్ మహేశ్‌దత్ ఎక్కా, కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా డీఎస్‌ఓఏ వి.రంగారెడ్డి, గౌలిదొడ్డి ప్రిన్సిపాల్ ప్రమోద తదితరులు మంత్రిని కలసి విద్యార్థుల ప్రతిభ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన జగదీశ్.. మెడిసిన్‌లో సీట్లు పొందే 40 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున, బీడీఎస్‌లో సీట్లు సాధించే వారికి రూ.40 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు