సర్కారు వైద్య సేవలపై సమీక్ష

1 Jan, 2019 17:08 IST|Sakshi
హరీష్‌ రావు

సిద్ధిపేట: ప్రభుత్వ వైద్య కళాశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మాజీ మంత్రి, సిద్ధిపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించిన అకౌంట్స్‌ విషయంలో జవాబుదారీతనంతో పని చేయాలని ప్రభుత్వ సిబ్బందికి సూచించారు. పాత ఎంసీహెచ్‌ని వైద్య కళాశాల ఆధీనంలోకి తీసుకుని వినియోగించుకోవాలన్నారు. రేడియాలజిస్టులు 24 గంటలూ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆసుపత్రిలో పోర్టుమార్టం చేయడంలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉండటం.. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ సేవలు, కళాశాల విద్యార్థుల బస్‌, డెంటల్‌ సిబ్బందికి వాహనాలు తొందరలోనే అందుబాటులోకి తేవాలని డీఎంఈని ఫోన్‌లో ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు ఆసుపత్రి అభివృద్ధి నిధి నుంచి సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే పక్షవాతం బారిన పడిన రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు