ప్రతి కుటుంబానికి  చిరకాలం గుర్తుండాలి    

5 Jul, 2019 11:50 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న హరీశ్‌రావు

నిరుద్యోగుల ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి

సీఎం రాక నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడకలో జరిగే అభివృద్ధి ప్రజలు చిరకాలం సీఎంను వారి హృదయాల్లో ఉంచుకునేలా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో  చింతమడకలో చేయనున్న ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే కేసీఆర్‌  ఆలోచన అన్నారు. ఇళ్లు లేని  ప్రతీ కుటుంబానికి యజమానులు ఇష్టం ఉన్నట్లుగా వారి స్థలంలో కట్టుకునేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రతీ కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలకు సూచించారు.   అలాగే అసైన్డ్‌ భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరుబావుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చరణ్‌దాస్‌ను ఆదేశించారు. పంచాయతీ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేనివారికి ట్రాక్టర్స్‌ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, రూ. 10 లక్షలతో హార్వేస్టర్, హర్టీకల్చర్‌తో మల్బరిసాగు, చెరువు సుందరీకరణ, గ్రామంలోని ప్రతీ కుటుంబం వివరాలు, ఫోన్‌ నంబర్లు సేకరించాలని సూచించారు.

అన్ని వివరాలతో నివేదిక
అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువత కోసం వారితో చర్చించి ఆటోలు, కార్లు, వంటి వాహనాలు అందించే ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు చేసిన సర్వేను ర్యాండమ్‌ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని తెలిపారు. గ్రామంలో 100 ఎకరాల్లో అడవి అభివృద్ధి కోసం ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఎంపీడీఓల బృందతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర సర్వే నిర్వహించినట్లు వివరించారు.    కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్, డీఆర్‌ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా అదికారులు పాల్గొన్నారు. 

నేడు చింతమడకకు హరీశ్‌రావు..
చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్‌ వస్తున్న క్రమంలో నేడు ఉదయం 7 గంటలకు హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిలు గ్రామంలో పర్యటించనున్నారు. మూడు రోజులుగా అధికారులు చేపట్టిన గ్రామ సమగ్ర కుటుంబ సర్వే, అక్కడి ప్రజల అవసరాలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని , ప్రత్యేక ప్రజా అవసరాలపై, జీవన స్థితిగతులపై ఆరా తీయనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు