భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు: సీఎం కేసీఆర్‌

21 Nov, 2023 14:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. మధిరలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి లింగాల క‌మ‌ల్‌రాజ్‌కు మ‌ద్దతుగా ఆయన ప్ర‌సంగించారు.. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలని అన్నారు.బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రైతు బంధు ఏడాదికి రూ. 16 వేలు ఇస్తామన్న కేసీఆర్‌.. 24 గంటల విద్యుత్‌ ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

దళిత సమాజం దోపిడీకి గురైందన్నారు సీఎం కేసీఆర్‌. దళితుల పేదరికం తొలగించేందుకు దళితబంధు తీసుకొచ్చామని తెలిపారు. దళితబంధు లాంటి ఆలోచన కాంగ్రెస్‌ ఏనాడైనా చేసిందా అని ప్రశ్నించారు. మధిరలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ అని తెలిపారు. పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం వ‌స్తుందని, అందులో మీకు ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదని అన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరకు చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్‌ విమర్శించారు. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదని దుయ్యబట్టారు. భట్టి చేసిందేమి లేదని, ద‌ళిత‌వ‌ర్గం ఒక్క ఓటు కూడా ఆయనకు వేయొద్దని హితవు పలికారు. ఈ ప‌ట్టి లేని భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఓటేస్తే మీకు వ‌చ్చేది ఏంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామన్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారని.. కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు, భూమేత అని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్‌ గెలిచేది లేదు సచ్చేది లేదని.. ఆ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు.


చదవండి: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా

మరిన్ని వార్తలు