కేసీఆర్‌ కామారెడ్డి పారిపోయింది అందుకే : భట్టి విక్రమార్క

21 Nov, 2023 18:02 IST|Sakshi

సాక్షి, మధిర : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సీల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్‌​ ఇచ్చారు. కేసీఆర్‌ మధిర సభ పూర్తవగానే మీడియాతో మాట్లాడిన భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో 78 సీట్లకు పైబడి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారన్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కావాలా?, కరెంట్ కావాలా? అని మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఉన్నందువల్లే కరెంట్‌ ఉందన్నారు.

2014 కంటే ముందు అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్‌ డిజైన్ చేసిందని భట్టి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు నాలుగు శాతం ఎక్స్‌ట్రా పవర్ కేటాయించారని గుర్తు చేశారు. రాయి ఏదో  రత్నం ఏదో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి బాధడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. గెలవలేననే భయంతోనే కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డి దాకా పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లాగా తాను ఫామ్‌హౌజ్‌లో పడుకోలేదని, రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతూనే మధిర నియోజకవర్గ సమస్యలపై గళమెత్తానన్నారు. 

ప్రజలు పడుతున్న బాధలు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి చూశానని చెప్పారు.  ఆ సమస్యల పరిష్కారం కోసమే ఆరు గ్యారెంటీలు పెట్టామన్నారు. భట్టి విక్రమార్కను ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. మధిర ప్రజలను ఎవరూ కొనలేరన్నారు. పెన్షన్లు ఇచ్చేది, ఇళ్లు కట్టించేది, ప్రాజెక్టులు కట్టేది, అట్టడుగు వర్గాలను పైకి తెచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరనేది హై కమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఏటీఎమ్‌లా మారిందని అమిత్‌ షా చెప్పారన్నారు. కేసీఆర్‌ అవినీతి  చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని భట్టి ప్రశ్నించారు.  

ఇదీచదవండి.భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు: సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు