మూఢనమ్మకాలు నమ్ముతారా.. అయితే జాగ్రత్త !

17 Jul, 2017 11:25 IST|Sakshi

వరంగల్‌: మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేస్తున్నా.. శాసనసభలో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే జాతకాలు చెప్పే కోయ దొరల మాయమాటలకు లొంగిపోయి లక్షల రూపాయలు సమర్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల చెవిలో పూలు పెట్టి పూజల పేరిట లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూజలు, యాగాల పేరిట జాతకాలు చెప్పే కోయదొరలు తమ వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేశారని హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ప్రజాప్రతినిధి బంధువులు నగరంలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలగులోకి వచ్చింది.తమ బంధువు అయినా ప్రజాప్రతినిధికి అత్యున్నత పదవీ వచ్చేందుకు రూ.57 లక్షలను వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి పోపలీసులకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ మేరకు వరంగల్‌ ప్రాంతానికి చెందిన వాస్తు, గ్రహ పూజలు చేసే కోయదొరలను ఆదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసు అధికారుల ఏర్పుటు చేసినట్లు తెలిసింది.

గతంలో వారి కుంటుబ సభ్యులకు పూజలు చేయడం వల్ల  పలు శుభాలు జరడగంతో వీరి మాటలు నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాశీలో పూజలు, అక్కడి పూజారులకు వేలల్లో డబ్బులు ఇచ్చేందుకు పలువురు కోయదొరలు దఫాల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హిమాలయాల్లో సైతం పూజలు చేయాలని కోరడంతో ఒకే సారి లక్షల్లో డబ్బులు వారికి అప్పగించినట్లు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఈ మోసానికి పాల్పడిన కోయదొరలను పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

 

>
మరిన్ని వార్తలు