సివిల్‌ వివాదాల్లో మీ జోక్యం ఏమిటి?

26 May, 2019 02:17 IST|Sakshi

పోలీసుల తీరుపై హైకోర్టు ఆక్షేపణ 

హయత్‌నగర్, తొగుట పోలీసులకు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు ఆక్షేపించింది. కుటుంబ, భూవివాదాల్లో జోక్యం  మంచిది కాదని హితవు పలికింది. కుటుంబ వివాదంలో జోక్యం చేసుకున్న సిద్దిపేట జిల్లా తొగుట పోలీసులకు, ఓ భూవివాదంలో జోక్యం చేసుకున్న రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు.

రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని సర్వేనంబర్‌ 1008తో పాటు వివిధ సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 71 ఎకరాల భూమి వివాదంలో హయత్‌నగర్‌ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ తౌరుస్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పోలీసులు స్టేషన్‌కు పిలిచి, తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారని, స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.  తమ కుటుంబ వివాదం లో కూడా తొగుట పోలీసులు జోక్యం చేసుకుంటూ బెదిరిస్తున్నారంటూ ఎండీ సాహెదుల్లా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై  జస్టిస్‌ చౌహాన్‌ విచారణ జరిపారు. పోలీసులు ఇలా సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటుండటంపై తరచూ  పిటిషన్లు దాఖలవుతున్నాయని, వీటిని బట్టి పోలీసులు సివిల్‌ వివాదాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుం టున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు