‘జర్మనీ సిటిజన్‌షిప్‌ వదులుకున్నారా?’

10 Feb, 2020 17:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణలో చెన్నమనేని రమేశ్‌ ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ కోర్టుకు తెలిపింది. తద్వారా రమేష్‌ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెప్తూనే జర్మనీ పాస్‌పోర్టుతో ఎందుకు వెళ్లావని న్యాయస్థానం చెన్నమనేనిని ప్రశ్నించింది.(చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట)

దీనికి ఆయన స్పందిస్తూ జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ‘జర్మనీ సిటిజన్‌షిప్‌ వదులుకున్నారా? అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా?’ అని హైకోర్టు వరుస ప్రశ్నలు సంధించింది. అనంతరం జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని చెన్నమనేనికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్‌ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి..  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతేడాది నవంబర్‌ 20న అతని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం రద్దు)

మరిన్ని వార్తలు