హైవే పోలీస్‌

10 Jan, 2020 10:14 IST|Sakshi
వాహనాలను ప్రారంభిస్తున్న సజ్జనార్‌

అందుబాటులోకి నేషనల్‌ హైవే పెట్రోలింగ్‌ సేవలు

క్షతగాత్రులకు సహాయం చేస్తే కేసులు ఉండవు

ప్రజలు అపోహలు వీడాలి: సైబరాబాద్‌ సీపీ

తొలిసారిగా ఎన్‌హెచ్‌–44పై షురూ..

రోడ్డు ప్రమాద మృతులను తగ్గించడమే లక్ష్యం  

త్వరలో బాలానగర్, మాదాపూర్‌ జోన్లలో ప్రారంభం  

సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు క్షతగాత్రులను రక్షించే క్రమంలో తమపైనా కేసులునమోదవుతాయన్న అపోహలు ప్రజలు వీడనాడాలని, సహాయం చేసేవారిపై ఎలాంటి కేసులు ఉండవని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో సహాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో గురువారం హైవే పెట్రోలింగ్‌ వాహనాలను ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. ఇటు జాతీయరహదారులు, అటు అంతర్గతరహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగ్రాతులను సరైన సమయాల్లో ఆస్పత్రికి చేర్చకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్టుఅధ్యయనంలో తేలిందన్నారు.

ఈ ఏడాది రోడ్డు భద్రతపై ప్రధానంగా దృష్టి సారించామని, ఇందులో భాగంగా‘నేషనల్‌ హైవే పెట్రోలింగ్‌’తోపాటు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 36 పోలీసు స్టేషన్ల పరిధిలో కానిస్టేబుల్‌ స్థాయి గల సిబ్బందిని రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల సహాయానికి కో–అర్డినేటర్స్‌ (సమన్వయకర్త)గా నియమించామన్నారు. వీరు 24 గంటలపాటు విధుల్లో సేవలు అందిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు బతికేందుకు అవకాశమున్న ‘గోల్డెన్‌ అవర్‌’(తొలి గంట)లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్పించేలా అటు హైవే బృందాలు, ఇటు కో–అర్డినేటర్స్‌ సమర్థంగా పనిచేసేలా వైద్యులతో శిక్షణ ఇప్పించామని సీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు రక్షించడంపై ప్రతి ఆస్పత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌తో పాటు ఎమర్జెన్సీ సెంటర్‌ ఉండేలా చూడాలని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరామన్నారు. 

తొలిసారి శంషాబాద్‌ జోన్‌లో..
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే ఎన్‌హెచ్‌–44 మార్గంలోని రాజేంద్రనగర్‌ ఠాణా పరిధి హసన్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి షాద్‌నగర్‌ ఠాణా పరిధిలోని హమీద్‌ కాటన్‌ మిల్స్‌ వరకు 54 కిలోమీటర్లలో నాలుగు పెట్రోలింగ్‌ వాహనాలు గురువారం నుంచి సేవలు అందిస్తాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు. త్వరలో మాదాపూర్, బాలానగర్‌ జోన్లలోనూ హైవే పెట్రోలింగ్‌ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ఒక్కో పెట్రోలింగ్‌ వాహనంలో ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక డ్రైవర్‌ ఉంటారు. వీరికి రోడ్డు ప్రమాద సమయాల్లో అవసరమైన 18 అర్టికల్స్‌ అందించాం. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్, బ్రీత్‌ అనలైజర్, ట్యాప్, వాహనాలు ప్రమాదమై అందులో శరీరాలు ఇరుక్కుపోయినా.. వెహికల్‌ స్ట్రక్‌ అయినా కట్‌ చేయడానికి కట్టర్స్, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి స్ట్రెచర్‌ అందుబాటులో ఉంచాం. రెండు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు పెట్రోలింగ్‌ చేస్తారు. ఏమాత్రం ఇబ్బంది, అవసరమున్నా, రోడ్డు ప్రమాదమైనా డయల్‌ 100కి కాల్‌ చేయండి. లేదంటే హైవే పెట్రోలింగ్‌ నంబర్‌ 85004 11111కు సమాచారం అందించండి’ అని సీపీ ప్రజలను కోరారు. 

హైవే రక్షణ దళం విధులు ఏమంటే..  
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఈ హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెళ్లి క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స చేసి వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తారు. ఫొటో, వీడియో తీస్తారు. లా అండ్‌ అర్డర్‌ పోలీసులు, 108కి కూడా సమాచారం ఇస్తారు. డ్రంకన్‌ డ్రైవ్, హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం, ట్రిపుల్‌ రైడింగ్, ఆటోల్లో ఎక్కువగా ప్రయాణికులు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, అతి వేగంగా వెళ్లడం తదితర ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారు. అనధికారిక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలతో పాటు మద్యపానాన్ని నియంత్రిస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటారు. వాహనాలు బ్రేక్‌డౌన్, ఇంధనం అయిపోయినా, సరైన మార్గం లేకుండా వేచి ఉండేవారికి సహకరిస్తారు. ఆస్పత్రులు, ఠాణాలు, ఆర్‌టీఓ, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బందిని సమన్వయం చేస్తారు. అలాగే, రోడ్డు ధ్వంసమై ఉండటం, సైన్‌ బోర్డులు, మార్కింగ్‌లు సరిగా లేకపోయినా నివేదిక రూపొందించి సంబంధిత విభాగాలకు పంపుతార’ని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.  

త్వరలో ఈ ప్రాంతాల్లోనూ..
స్టేట్‌ హైవే నార్సింగి నుంచి మెయినాబాద్‌ చేవెళ్ల రోడ్డు శంకర్‌పల్లి రోడ్డు, రాజీవ్‌ రహదారి, డెయిరీ ఫాం సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్, హత్‌వేలీ నేషనల్‌ హైవే, మియాపూర్‌ జంక్షన్‌ నుంచి బాచుపల్లి గండిమైసమ్మ మేడ్చల్‌ చెక్‌పోస్టు ప్రాంతాల్లో హైవే పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తేనున్నారు. 

మరిన్ని వార్తలు