హిజ్రాల హక్కులను హరిస్తోంది

1 Mar, 2018 04:23 IST|Sakshi

యూనక్స్‌ చట్టంపై ఉమ్మడి హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: శతాబ్దం కిందట (1919) నిజాం కాలంలో హిజ్రాలకు సంబంధించి తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్‌ చట్టంలోని కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిబంధనలను తాము కొట్టేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలంది. రాజ్యాంగం అమల్లోకి రాక ముందు తీసుకొచ్చిన ఈ చట్టంపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది.

15–16 ఏళ్ల బాలుడిని హిజ్రాలు తమ వద్ద ఉంచుకోవడం నేరమన్న ఈ చట్ట నిబంధనలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సమాజంలో పిల్లలపై అనేక రకాలుగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వీటిని కేవలం హిజ్రాలకే ఆపాదించడం ఎంత మాత్రం సరికాదంది. అలాగే హిజ్రాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని.. నాట్యం, సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నా అరెస్ట్‌ చేయవచ్చునన్న నిబంధనలు సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘి క సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ యూనక్స్‌ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దానిని కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన వి.వసంత, కేఎంవీ మోనాలీసా, మరొకరు హైకోర్టులో  పిల్‌ వేశారు.  

హిజ్రాలపై ఇష్టానుసారం కేసులు..
విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 1919లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్‌ చట్టం నిబంధనలను అడ్డం పెట్టుకుని హిజ్రాలపై పోలీసులు ఇష్టానుసారం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు.  కర్ణాటకలో న్యాయపోరాటం చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం యూనక్‌ (నపుంసకుడు) అన్న పదాన్ని తొలగించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణ యూనక్స్‌ చట్టం అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 99 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం కింద రాష్ట్రంలో కేసులెన్ని నమోదయ్యాయో పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ అన్నారు. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు