కంచి మఠం ఆస్తులు వేల కోట్లు | Sakshi
Sakshi News home page

కంచి మఠం ఆస్తులు వేల కోట్లు

Published Thu, Mar 1 2018 4:12 AM

Kanchi Kamakoti Peetham assets was thousands of crores - Sakshi

కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి హయాంలో కంచి మఠం ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందాయి. వేలకోట్ల ఆస్తులు పెరిగి మఠం పేరు ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తిచెందాయి. ప్రస్తుతం ఉన్న శిష్యగణంలో 40% అదనంగా శిష్యులు, భక్తులు పెరిగారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిర, చరాస్తులు పెరిగాయి. అమెరికా, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లోనూ స్వామీజీ భక్తులు పెరిగారు. జయేంద్ర సరస్వతి కంటే ముందు 68 మంది పీథాధిపతులు పనిచేయగా వీరంతా హిందూమత ప్రచారానికే పరిమితమయ్యారు. జయేంద్ర సరస్వతి మాత్రం కంచి కామకోటి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మత ప్రచారంతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించారు. పారిశ్రామికవేత్తలను శిష్యులుగా చేర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అధిక మొత్తంలో విరాళాలు రాబట్టారు. ఆయుర్వేద ఆస్పత్రి, వర్సిటీలు నిర్మించి.. గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించారు. దేశవ్యాప్తంగా 38 శాఖలను ప్రారంభించి భక్తుల నుంచి వేల కోట్ల విరాళాలను ట్రస్ట్‌కు రాబట్టారు. ఈ సొమ్ములతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో ప్రముఖుల దృష్టి కంచి మఠం వైపు మళ్లింది.

ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది..
మఠం మేనేజర్‌ సుందరేశ్‌ అయ్యర్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని కార్యాలయం నుంచి తమకు ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. స్వామీజీ అధిష్టానం గురించి వారు వాకబు చేశారని వివరించారు. దీనికి ఎవరెవరు వస్తున్నారో తెలియపర్చలేదని తెలిపారు. బుధవారం రాత్రి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కంచి మఠానికి చేరుకుని జయేంద్రసరస్వతి పార్థీవదేహానికి నమస్కరించారు. స్వామీజీ ఆకస్మిక మరణం మనస్సును కలచివేసిందని చెప్పారు.

Advertisement
Advertisement