ఏపీలో హెచ్‌పీసీఎల్ యూనిట్

15 Dec, 2014 03:30 IST|Sakshi
ఏపీలో హెచ్‌పీసీఎల్ యూనిట్
  • రూ. 75 వేల కోట్లతో హైడ్రోకార్బన్ క్రాకర్ విభాగం
  •  హిందుస్థాన్ పెట్రోలియం సూత్రప్రాయ అంగీకారం
  •  అంతర్జాతీయ భాగస్వామి కోసం హెచ్‌పీసీఎల్ నిరీక్షణ
  •  వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకై చర్యలు
  •  వివిధ ప్రతిపాదనలపై అధికారులకు సీఎస్ ఆదేశాలు
  • సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ హైడ్రోకార్బన్ క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన యూనిట్ల ఏర్పాటు అంశాలపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు హెచ్‌పీసీఎల్ అంతర్జాతీయ భాగస్వామి కోసం అన్వేషిస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సీఎస్‌కు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సీఎస్ సూచించారు. పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలను వెలికితీయడమే క్రాకర్ యూనిట్ లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
     
    కేంద్ర వ్యవసాయ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
     
    వైఎస్సార్ కడప జిల్లాల్లో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధు లు జిల్లాకు వచ్చి వెళ్లారని, వారు పలు అంశాలను ప్రస్తావించారని, వాటిపై వివరణలు ఇచ్చామని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. అయితే తరువాత స్టీల్ అథారిటీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. అవసరమైతే స్టీల్ అథారిటీకి వెళ్లి ప్లాం ట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
     
    విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు అవసరమైన భూ సేకరణ చేయాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని భరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయాలని మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎస్ సూచించారు.
     
    పెట్రోలియం మరియు సహజ వాయువు యూనివర్సిటీ ఏర్పాటుపై డెహ్రాడూన్ పెట్రోలియం యూనివర్సిటీకి చెందిన జె.పి.గుప్త కాకినాడ, రాజమండ్రిలో ప్రతిపాదితన స్థలాన్ని పరిశీలించారని, అయితే తరువాత ఎటువంటి స్పందన లేదని పరిశ్రమల శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. అక్కడి నుంచి స్పందన రాకపోయినా తదుపరి చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

    రాయపూర్ నుంచి విశాఖపట్నానికి నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై త్వరలో జరిగే కేంద్ర జోనల్ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అధికారులు సీఎస్‌కు వివరించారు.
     
    కృష్ణా జిల్లాలో కొండపల్లి దగ్గర మెగా పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని, అలాగే నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన భూమిని పర్యాటక శాఖకు అప్పగించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
     
    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రైల్వే బోర్డు నుంచి ఎటువంటి చర్యలు లేవని, ఈ నేపథ్యంలో సీఎం చేత రైల్వే మంత్రికి లేఖ రాయించాలని సీఎస్ నిర్ణయించారు.
     
    ప్రతి నెలలో ఒక రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్

    వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలలో ఒక రోజు ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్ డే’గా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్ణయించారు. ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛాం ధ్రప్రదేశ్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 365 రోజులు సచివాలయంలోని కార్యాలయాలు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలాగ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, దీన్ని గర్వకారణంగా ఉద్యోగులు భావించాలని సీఎస్ నిర్దేశించారు.
     

>
మరిన్ని వార్తలు