మద్యం రాబడి ఫుల్లు.. 

17 Oct, 2019 08:38 IST|Sakshi
టెండర్లు దాఖలు చేస్తున్న దృశ్యం

సీజన్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం  

రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెరిగిన రుసుము 

 

సాక్షి, కొత్తగూడెం:  ఆబ్కారీ శాఖ ఆదాయం మద్యం కిక్కుతో తడిసి ముద్దయింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో జిల్లాలో దండిగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్‌ శాఖ మరింత ఉత్సాహంగా ఉంది. 2017 సెప్టెంబర్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల రూపంలో రూ.22 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుతం సరికొత్త మద్యం పాలసీ ద్వారా మరింత రాబడి వచ్చింది.

గత సీజన్‌తో పోలిస్తే జిల్లాలో దాదాపు మూడు రెట్ల ఆదాయం అధికంగా రావడం విశేషం. దరఖాస్తు ఫీజు గత సీజన్‌లో రూ.లక్ష ఉన్నప్పుడు మొత్తం 2,204 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 3402 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎక్సైజ్‌ శాఖకు ఈ ఏడాది రూ.68.04 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలకు పెంచినా, ఊహించని రీతిలో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తులు తగ్గినా పెంచిన దరఖాస్తు ఫీజుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావించారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ మద్యం వ్యాపార ఆశావహులు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేశారు.

దీంతో ఆదాయం గ్రాఫ్‌లో మరింతగా పైకి దూసుకుపోయింది. ఇక దరఖాస్తుదారులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వేచి చూస్తున్నారు. కాగా, కొత్తగూడెంలోని కమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం (18వ తేదీ) కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ లాటరీ తీయనున్నారు. ఇందుకోసం ఆశావహులైన వ్యాపారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉండగా, 35 ఏజెన్సీ పరిధిలో, 41 మైదాన, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. 

లైసెన్స్‌ ఫీజు పెంచినా దరఖాస్తులు తగ్గలే..
ఈసారి ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం దరఖాస్తు ఫీజు రెట్టింపు చేయడంతో పాటు లైసెన్సు ఫీజులు జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచారు. దీంతో పాటు ప్రతి దుకాణానికి ప్రత్యేక రిటైల్‌ ట్యాక్స్‌ పేరుతో అదనంగా రూ.5 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ వ్యాపారులు, ఆశావహులు వెనుకడుగు వేయలేదు. ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేస్తున్న వారు గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. ఎప్పటిలాగే  ఒకటి, రెండు దరఖాస్తులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు సైతం దాఖలు చేశారు.

ఇక కొత్తగా ఎన్‌ఆర్‌ఐలు సైతం మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేయించారు. కొందరు ఎన్‌ఆర్‌ఐలు చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇక సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు సైతం జిల్లాలో భారీగానే దరఖాస్తులు దాఖలు చేశారు. జిల్లాలో 3402 దరఖాస్తులు దాఖలు కాగా, అందులో సుమారు 1000 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాఖలు చేసినవేనని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ టెండర్‌ వేయడం గమనార్హం. 

ఏజెన్సీలో బినామీ పేర్లతో... 
జిల్లాలోని మున్సిపాలిటీ, మైదాన ప్రాంత దుకాణాలతో పాటు ఏజెన్సీ పరిధిలో ఉన్న దుకాణాలకు సైతం వ్యాపారులు బినామీల ద్వారా దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రస్తు తం ఇతర వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో పాటు, పలు విభాగాల కాంట్రాక్ట్‌ పనుల్లో బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పలువురు కొత్తవారు సైతం మద్యం వ్యాపారం వైపు దృష్టి సారించారు.

అదేవిధంగా మద్యం వ్యాపారం పూర్తిగా లిక్విడ్‌ క్యాష్‌ వ్యాపారం కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నవారు సైతం మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇన్ని రకాల విశేషాల నేపథ్యంలో ఆబ్కారీ శాఖకు కాసుల వర్షం కురిసింది.   

మరిన్ని వార్తలు