గోవా బీచ్‌లో నగరవాసి మృతి

8 Oct, 2014 01:02 IST|Sakshi
గోవా బీచ్‌లో నగరవాసి మృతి

 స్విమ్మింగ్ చేస్తూ మరణించిన ఇంటీరియర్ డిజైనర్ అపర్ణ
 సాక్షి, హైదరాబాద్: గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నగరవాసి మృతి చెందారు. కుటుంబంతో సహా కలిసి గోవాకు వెళ్లిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అపర్ణా కార్వీ (44) ఆదివారం మరణించారు. స్కూబా డైవింగ్, స్విమ్మింగ్‌లో పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న అపర్ణా చివరికి అదే స్విమ్మింగ్‌లో మృతి చెందడంపై ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లో నివాసముండే అపర్ణ సెలవులు రావడంతో కుటుంబంతో కలిసి గోవాకు వెళ్లారు. సోమవారం తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. బక్రీద్ సెలవు ఉండటంతో తిరుగు ప్రయాణం టికెట్ రద్దు చేసి కొని మరీ అక్కడే ఉండిపోయారు.
 
 ఆదివారం మధ్యాహ్నం గోవాలోని అశ్వం బీచ్‌లో స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఒక్కసారిగా అలలు ఉధృతం కావడంతో తెప్ప మీద పడింది. దీంతో ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరి ఊపిరాడక అక్కడిక్కడే చనిపోయారు. సమయానికి అంబులెన్స్‌లు, లైవ్ జాకెట్లు లేకపోవడంతో మృతి నుంచి తప్పించుకోలేక పోయిందని అపర్ణ స్నేహితుడైన కిమ్స్ ఆస్పత్రి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ పీ రఘురాం ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని నివాసానికి అపర్ణా మృతదేహం వచ్చింది. బుధవారం ఉదయం వెస్పర్‌వ్యాలీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు