3.25 లక్షల ఉపాధి అవకాశాలు | Sakshi
Sakshi News home page

3.25 లక్షల ఉపాధి అవకాశాలు

Published Wed, Oct 8 2014 1:00 AM

3.25 లక్షల ఉపాధి అవకాశాలు - Sakshi

న్యూఢిల్లీ: ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకునే చిన్నపాటి రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్లతో రాబోయే పదేళ్లలో దేశీయంగా 3.25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు, అత్యంత భారీ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్లతో 63,000 ఉద్యోగాలు రానున్నాయి. సౌర విద్యుత్ రంగానికి సంబంధించిన కన్సల్టింగ్ సంస్థ బ్రిడ్జ్ టు ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సౌర విద్యుత్ రంగాన్ని చిన్న రూఫ్‌టాప్స్, పెద్ద రూఫ్‌టాప్స్, యుటిలిటీ స్కేల్ ప్రాజెక్టులు, అల్ట్రా మెగా ప్రాజెక్టులు కింద నాలుగు విభాగాలుగా విభజించారు.

చిన్న తరహా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 3 కేడబ్ల్యూపీ (కిలోవాట్ పీక్), పెద్దదైతే 250 కేడబ్ల్యూపీ, యుటిలిటీ స్కేల్ ప్రాజెక్టుది 20 మెగావాట్లు, అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 1,000 ఎండబ్ల్యూపీ ఉంటుంది.  పెద్ద రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ద్వారా పదేళ్లలో 2.20 లక్షల దాకాను, యుటిలిటీ ప్రాజెక్టుల్లో 71,000 మేర ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సౌర విద్యుత్ రంగంలో పారదర్శక  విధానాలు దేశీ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,600 మెగావాట్లుగా ఉంది. 2022 నాటి కల్లా దీన్ని 20,000 మెగావాట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement
Advertisement